రాష్ట్ర సాధ‌న‌లో క‌రీంగ‌న‌ర్‌ది కీల‌క‌ పాత్ర‌

– బ‌హుజ‌న రాజ్యానికి పునాదులు వేసిన గ‌డ్డ‌
– మాట నిల‌బెట్టుకున్న సోనియ‌మ్మ‌
– తొలి ఏడాదే 60వేల ఉద్యోగాల భ‌ర్తీ
– మ‌రో 40వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాం
– ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి
– హుస్నాబాద్‌లో రూ.22.78 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌

హుస్నాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 3: హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న నేతృత్వంలో బహుజన రాజ్యానికి పునాదులు వేసిన గడ్డ ఇదని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రూ.262.78 కోట్లతో హుస్నాబాద్ లో పలు అభివృద్ధి పనులకు బుధ‌వారం శంకుస్థాపన చేసిన అనంత‌రం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో కరీంనగర్ ప్రజలు కీలక పాత్ర పోషించారన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కరీంనగర్ వేదికగా సోనియమ్మ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. అరవై ఏళ్ల కల నెరవేర్చిన సోనియమ్మను కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం అందించి ఇక్కడికి వచ్చాన‌న్నారు.
మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ, ప్రధాని మోడీని కలిసి గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించాన‌న్నారు. డిసెంబర్ 3 కు ఒక ప్రత్యేకత ఉంది. మీ ఓటును ఆయుధంగా మార్చి దుర్మార్గ  పాలనను అంతమొందించి ప్రజా పాలనను తీసుకొచ్చిన రోజు ఇది. తెలంగాణ కోసం శ్రీకాంతచారి అమరుడైన రోజు ఇదని గుర్తుచేశారు. ఆయ‌న‌ ఆశయ సాధనలో భాగంగా మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. రెండున్నరేళ్లు పూర్తి చేసుకునేలోగా మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రజా ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే రైతులకు రూ. 2 లక్షల వ‌ర‌కు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేశామ‌న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.లక్షా 4 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశామ‌న్నారు. రూ.8 వేల కోట్లు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం ఖర్చు చేశామ‌న్నారు. ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం. లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించాం. పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. దాదాపు  50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు హుస్నాబాద్ కు సాగునీరు అందించే గండిపెల్లి, గౌరెల్లి ప్రాజక్టులను పూర్తి చేయలేదు. గత పాలకులు ప్రచారం మొదలు పెట్టేందుకు సెంటిమెంట్ గా హుస్నాబాద్ ను  ఉపయోగించుకున్నారన్నారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను అభివృద్ధి చేసుకున్నారు కానీ హుస్నాబాద్ ను అభివృద్ధి చేయలేదు. గత పాలకుల్లా తాము హుస్నాబాద్ ను నిర్లక్ష్యం చేయబోమ‌న్నారు. ఎన్ని నిధులైనా ఖర్చు చేసి హుస్నాబాద్ ను అభివృద్ధి చేస్తాం. పదేళ్లు ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. పదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తాం. సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇవి గ్రామాల్లో వెలుగులు నింపే ఎన్నికలు. మంచివాళ్లని ఎన్నుకోండి. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేసే వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండ‌ని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *