– అవినీతి, కుటుంబ పాలనలో ఒకేలా కేసీఆర్, విజయన్
– కేంద్ర నిధులు మోదీ కరుణ కాదు.. ప్రజల హక్కు
– యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదలలో తెలంగాణ సీఎం రేవంత్
కొచ్చి, ఏప్రిల్ 2: యూడీఎఫ్ ప్రకటించిన గ్యారంటీలపై విమర్శలు చేస్తున్న వారు అవి ఎలా అమలవుతాయో తెలుసుకోవాలంటే తెలంగాణకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో అమలవుతున్న పథకాలను ప్రత్యక్షంగా చూసి తమ ట్రాక్ రికార్డు పరిశీలించుకోవచ్చన్నారు. రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన మంత్రులు తెలంగాణకు వస్తే తాము గ్యారంటీలు ఎలా అమలు చేస్తున్నామో ప్రత్యక్షంగా చూపుతామన్నారు. కేరళం యూడీఎఫ్ మేనిఫెస్టోను కొచ్చిలో గురువారం ఆయన సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేరళంలో పినరయి విజయన్ హయాం ముగిసిందని, ఇక యూడీఎఫ్ స్వర్ణయుగం మొదలవుతుందని అన్నారు.
పినరయి.. కేసీఆర్‌ల మధ్య పోలికలు
విజయన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశాన్ని, కేరళంనూ మోదీ బ్రదర్స్ పాలిస్తున్నారని మోదీ, విజయన్‌లనుద్దేశించి వ్యాఖ్యానించారు. దేవుడి సొంత రాష్ట్రంలో దేవుడి ఆస్తికీ రక్షణ లేదంటూ పరోక్షంగా శబరిమల బంగారం ఉదంతాన్ని సీఎం లేవనెత్తారు. కేరళంలో పదేళ్లుగా విజయన్ ప్రభుత్వం కొనసాగుతోందని, అలాగే 2014 నుంచి సుమారు పదేళ్లపాటు కేసీఆర్ తెలంగాణను పాలించారని తెలిపారు. కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలన విషయంలో పినరయి విజయన్, కేసీఆర్‌ల మధ్య అనేక పోలికలున్నాయని విమర్శించారు. 2023లో తెలంగాణ మాదిరి మార్పు కేరళంలోనూ చోటుచేసుకుంటుందని సీఎం అన్నారు. విజయ్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘పో మోనే విజయా’ వ్యాఖ్యపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయన్ తమకు రాజకీయ ప్రత్యర్థి అని, మోదీలా మాట్లాడటం తనకు సాధ్యం కాదని, విమర్శించకుండా ఉండటం తన స్వభావం కాదని స్పష్టం చేశారు. అవినీతి నియంత్రణ, ఆదాయానికి గండిపెట్టే అంశాలను నియంత్రించడం, కేంద్ర పథకాల గరిష్ఠ వినియోగం, రాష్ట్రానికి రావలసిన నిధుల సాధన తమ ప్రాధాన్య అంశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరుణ కాదని, అది తమ హక్కు అనే విషయం ప్రజలకు తెలియజేస్తామన్నారు. యూడీఎఫ్ కార్మికుల కూటమి అని, కూటమిలో నిజాయతీగల నాయకులు ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు.
తొలి కేబినెట్ నుంచే హామీల అమలు
కేరళంలో యూడీఎఫ్ గ్యారంటీలు అమలు సాధ్యమా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, దానికి సమాధానం తెలంగాణేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ.21 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని తెలిపారు. సాగు చేసుకునే రైతులకు ఎకరాకు రూ.12 వేల చొప్పున ఏడాదికి రూ.18 వేల కోట్లు రైతు భరోసా కింద అందజేస్తున్నామన్నారు. 67,173 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, వివిధ శాఖల్లో నియామకాలు పూర్తి చేయడంతోపాటు ఎంపికైన వారికి ప్రజల సమక్షంలో నియామక పత్రాలు అందజేశామని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొచ్చామని వివరించారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఆదా అవుతోందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మహిళలను బస్సుల యజమానులుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్-2047 డాక్యుమెంట్ ప్రకారం 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపనున్నామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వృద్ధి రేటు 10.8 శాతంగా ఉందని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్యమని నిరూపించామని రేవంత్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కేపీసీసీ ప్రెసిడెంట్ సన్నీ జోసెఫ్, కేరళ సీఎల్పీ నేత వి.డి.సతీషన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీప్‌దాస్ మున్షీ, యూడీఎఫ్ కన్వీనర్ ఆదూర్ ప్రకాష్, ఐయూఎంఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.కె.కున్హాలికుట్టి తదితరులు పాల్గొన్నారు.
కేరళంలో ఇందిరా ఐదు గ్యారంటీలు
1.కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కేఎసఆర్టీసీ) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
2. కాలేజీ విద్యార్థినులకు నెలకు రూ.1,000 ఆర్థిక సహాయం
3. సంక్షేమ పింఛన్లు నెలకు రూ.3 వేలకు పెంపు
4. మాజీ సీఎం ఊమెన్ చాందీ పేరుతో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా
5. యువతకు స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
ఈ ఐదు గ్యారంటీలతోపాటు సముద్ర, విమానయాన రంగాలకు సంబంధించి ఐదు డ్రీమ్ ప్రాజెక్టులు, వయనాడ్‌లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు వాగ్దానాలు ఉన్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





