బీసీ రిజర్వేషన్లపై మాట నిలుపుకున్నాం

`సీఎం రేవంత్‌రెడ్డి
– ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, ఇతర నాయకులు కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ వందేళ్ల బీసీల ఆకాంక్షను రాహుల్‌ గాంధీ, ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ నెరవేర్చిందన్నారు. బీసీ రిజర్వేషన్లు గొప్ప కార్యక్రమమంటూ ఆనాడు దళితులు, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ రిజర్వేషన్లు కల్పించిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చగా కులగణన చేస్తామని రాహుల్‌ గాంధీ తన భారత్‌ జోడో యాత్రలో స్పష్టం చేశారని గుర్తు చేశారు. రాహుల్‌ గాంధీ మాట తమకు శిలాశాసనం అని, నాయకుడు మాట ఇస్తే దాన్ని నేరవేర్చాల్సిన బాధ్యత తనది, తమ పీసీసీ అధ్యక్షుడిది అని చెప్పారు. కులగణనకు ఎన్నో అవాంతరాలు వచ్చినా వాటిని అధిగమించామని, ఏడాదిలో పూర్తి పారదర్శకంగా, పక్కాగా పూర్తిచేశామని, ఫిబ్రవరి 4ని సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రకటించుకున్నామని సీఎం వివరించారు. కులగణనకు తాము వ్యతిరేకమని బీజేపీ గతంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందని చెప్పారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని జంతర్‌ మంతర్‌లో నిర్వహించిన ధర్నాకు 16 పార్టీలు మద్దతు ఇచ్చాయని, మన ఒత్తిడికి లొంగే కేంద్రం 2026లో జరిగే జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించిందని చెప్పారు. తెలంగాణ నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేసిందని, బీసీ రిజర్వేషన్లపై తమకు చిత్తశుద్ధి లేదని కొందరు అంటున్నారని, అయితే చిత్తశుద్ది లేనిది బీజేపీకేనని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌ చేర్చి చట్టబద్దత కల్పించాల్సింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, ఎంపీలు లక్ష్మణ్‌, ఆర్‌,కృష్ణయ్య దీన్ని సాధించాలని డిమాండ్‌ చేశారు. మోదీ స్థానంలో రాహుల్‌ గాంధీ ఉంటే 48 గంటల్లో నేను రిజర్వేషన్లను సాధించుకు వచ్చేవాడినంటూ ప్రధాని మోదీని తెలంగాణకు చెందిన బీజేపీ మంత్రులు ప్రశ్నించాలి, ఆ పార్టీ నాయకులు తమ నిబద్ధతను చూపించాలి అని డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్ల కోసం ఇంకా ఏం చేయాలన్నా నేను సిద్ధం.. ఏం చేయాలో చెప్పండి.. అర్ధరాత్రి కూడా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తా.. ఈ విషయంలో తనను ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు, నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి డెడ్‌ లైన్‌ విధించిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకే ఇంత కాలం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశామని చెప్పారు. 50శాతానికి మించి రిజర్వేషన్లు పెంచొద్దని గత కేసీఆర్‌ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టం చేసింది.. ఈ చట్టం చేసినప్పుడు మంత్రులుగా ఉన్నా గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, శ్రీనివాస్‌ యాదవ్‌లను కేసీఆర్‌ ఇప్పుడు తమ పైకి ఉసిగొల్పుతున్నాడు.. ఈ నిబంధనను సవరిస్తూ ఇప్పుడు ఆర్డినెన్స్‌ చ్చాం.. నాకు తోడుగా ఉండండి.. రక్షణ కవచంలా ఉండి రిజర్వేషన్లను కాపాడుకోవాలి.. రిజర్వేషన్లపై ఎవరైనా కోర్టుకు వెళ్తే వాదించడానికి ఢల్లీి నుంచి ఉద్దండులైన న్యాయవాదులను నియమిస్తా.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాగితం పెట్టిన వాళ్ళని, కాగితం పెట్టించిన వాళ్లను సామాజిక బహిష్కరణ చేస్తామని ప్రకటించండి.. బీసీ రిజర్వేషన్లపైన కాంగ్రెస్‌ ఎంపీలతోపాటు ఇండియా కూటమి ఎంపీలకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తాం.. అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు అయితేనే నిజమైన విజయం.. 2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే ప్రధాన జెండా కావాలి అని సీఎం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *