తెలంగాణకు 4 కేంద్రీయ విద్యాలయాల మంజూరు

– కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కిషన్‌ రెడ్డి

న్యూదిల్లీ, అక్టోబర్‌ 1 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా మరో నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలకు తోడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం, ములుగు జిల్లా కేంద్రం (గిరిజన ప్రాంతం), జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్‌ మండలం చెల్గల, వనపర్తి జిల్లా నాగవరం శివారులో ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఈ నాలుగు విద్యాలయాలు మారుమూల ప్రాంతాల్లో నాణ్యమైన ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను అందించడంలో కీలకం కానున్నాయని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో విద్యాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. గత రెండేళ్లలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నాణ్యమైన ప్రాథమికోన్నత విద్యను అందించేందుకు రూ.400 కోట్లతో 832 పీఎం-శ్రీ స్కూల్స్‌ను మంజూరు చేసిందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా పీఎం శ్రీ స్కూల్స్‌ కోసం ఎక్కువ కేటాయింపులు అందుకున్న రాష్ట్రం తెలంగాణనే కావడం విశేషమన్నారు. సమగ్రశిక్షా అభియాన్‌ కింద గత రెండేళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.2వేల కోట్లు కేటాయించిందని వివరించారు. దాదాపు రూ.వెయ్యి కోట్లతో ములుగు జిల్లాలో సమ్మక్క, సారక్క సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *