కేసీఆర్‌ది ముందుచూపు.. రేవంత్‌ది మంద బుద్ధి

– రెండేళ్లుగా టిమ్స్‌లను పడావు పెట్టారు
– డేట్లు, డెడ్‌ లైన్లు మారాయి తప్ప పనులు పూర్తి కాలేదు
– బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టించిన ప్రభుత్వం
– హాస్పిటల్స్‌తో రాజకీయాలు చేయడం తగదు
– రేవంత్‌ సర్కారుపై హరీష్‌రావు మండిపాటు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4: కేసీఆర్‌ పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం చేరువయ్యేలా హైదరాబాద్‌ నలువైపులా నాలుగు టిమ్స్‌ హాస్పిటల్స్‌, వరంగల్‌ హెల్త్‌ సిటీ నిర్మాణాలు చేపట్టగా దాదాపు పూర్తికావచ్చాయని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకొచ్చాక పనులు ముందుకు పోవడం లేదని బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు విమర్శించారు. ఎల్బీనగర్‌ టిమ్స్‌ నిర్మాణ పనులను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్బీ నగర్‌ టిమ్స్‌ సెల్లార్‌తో కలుపుకొని ఆరు అంతస్తుల భవనం పనులను బీఆర్‌ఎస్‌ పూర్తి చేస్తే కాంగ్రెస్‌ రెండేళ్ల పాలనలో ఐదు అంతస్తులు మాత్రమే పూర్తి చేసిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండి ఉంటే హాస్పిటల్‌ ప్రారంభమై ప్రజలకు సేవలు అందించేదన్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందని బీఆర్‌ఎస్‌ చేసిన మంచిని ప్రజలు గుర్తు చేసుకుంటరనే దురుద్దేశంతో రేవంత్‌ రెడ్డి పనులు ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. ముందు చూపు లేని, మంద బుద్ధి గల కాంగ్రెస్‌ నాయకులు పనులు పూర్తి చేయడం లేదంటూ పనులు ఎందుకు ఆపుతున్నారు అని ప్రశ్నించారు. టిమ్స్‌ హాస్పిటల్స్‌ కోసం అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తెచ్చామని, కరోనా కాదు దాని తాత వచ్చినా ఎదుర్కొనేలా మొత్తంగా పది వేల సూపర్‌ స్పెషాలిటీ బెడ్స్‌ ఉండాలని వందేళ్ల ముందు చూపుతో ప్రణాళికలు వేశామని ఆయన తెలిపారు. కేసీఆర్‌ 33 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఉండేలా ప్లాన్‌ చేసి 2850 ఎంబీబీఎస్‌ సీట్లను 10వేలకు పెంచారన్నారు. తాము మహేళ్వరం నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లా మెడికల్‌ కాలేజీ మంజూరు చేస్తే శంకుస్థాపన చేసిన కాలేజీని రద్దు చేసి టిమ్స్‌ ఎల్బీ నగర్‌లో విలీనం చేశారన్నారు. కుత్బుల్లాపూర్‌లో మెడికల్‌ కాలేజీ శాంక్షన్‌ చేస్తే దాన్ని టిమ్స్‌ అల్వాల్‌లో కలిపారన్నారు. కేసీఆర్‌ అల్వాల్‌లో మెడికల్‌ కాలేజీతోపాటు, 500 పడకల హాస్పిటల్‌ రావాలని చూశారని, కానీ మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌లలో మెడికల్‌ కాలేజీ, 500 పడకల హాస్పిటల్‌ లేకుండా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకుల తప్పుడు చర్యల వల్ల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, వరంగల్‌ హెల్త్‌ సిటీ, హైదరాబాద్‌ టిమ్స్‌ హాస్పిటల్స్‌ను యుద్ధప్రాతిపాదికన పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. రాజకీయాలు చేస్తే చేయండి.. మా మీద కేసులు పెట్టండి.. కానీ హాస్పిటల్స్‌ నిర్మాణాలు ఆపితే ప్రజల తిరుగుబాటు వస్తది అని హరీష్‌రావు హెచ్చరించారు. డెడ్‌ లైన్లు, డేట్లు మారుతున్నాయి తప్ప హాస్పిటల్స్‌ నిర్మాణాలు మారడం లేదని ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌ కిట్‌ బంద్‌, న్యూట్రిషన్‌ కిట్‌ బందు.. తిట్ల మీద రేవంతుకు ఉన్న ప్రేమ కిట్ల మీద లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రసవాలను 30 నుంచి 72 శాతానికి కేసీఆర్‌ ప్రభుత్వం పెంచితే రేవంత్‌ రెడ్డి 55 శాతానికి తగ్గించిండు..పేదలకు వైద్యంలో తిరోగమనం.. ప్రభుత్వ విద్యలో తిరోగమనం.. జీఎస్టీ వృద్దిలో తిరోగమనం.. రియల్‌ ఎస్టేట్‌లో తిరోగమనం.. రేవంతు పాలనలో రాష్ట్రం వెనక్కి పోతున్నది అని విమర్శించారు. కేసీఆర్‌ 450 బస్తీ దవాఖానలు ప్రారంభించినందుకు కేంద్రం, 15వ ఆర్థిక సంఘం తెలంగాణను మెచ్చుకున్నాయి.. ఆ దవాఖానలు మూతపడాలె అన్నదే రేవంతు లక్ష్యమా.. జూబ్లీహిల్స్‌ ప్రజలకు ఏం చెబుతావు అని నిలదీశారు. ఆరోగ్యశ్రీ, దవాఖానాల సిబ్బంది జీతాలు వంటి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కంటి వెలుగు అనే అద్భుతమైన పథకాన్ని రేవంతు బంద్‌ పెట్టిండంటూ రాజకీయాలు పక్కనబెట్టి వెంటనే పథకాన్ని కొనసాగించాలన్నారు. టిమ్స్‌ హాస్పిటల్స్‌ను యధావిధిగా వెయ్యి పడకలుగా కొనసాగించాలని, మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌లలో మెడికల్‌ కాలేజీలు కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా మీ మంద బుద్దిని మార్చుకోండి. పేదల ఆరోగ్యంతో చెలగాటం ఆపండి అని హరీష్‌రావు హితవు పలికారు. ఆయన వెంట మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, కాలేరు వెంకటేష్‌, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ చైర్మన్లు, ఇతర సీనియర్‌ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *