– ప్రజల సమస్యలపై ఎందుకు మాట్లాడరు
– అసెంబ్లీకి రాకుండా ఎందుకు ముఖం చాటేస్తారు
– ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆయన పార్టీ నేతలు ‘తెలంగాణ జాతిపిత’గా అభివర్ణించడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రంగా తప్పుబట్టారు. దేశానికి జాతిపిత ఒక్కరేనని, ఆయన మహాత్మా గాంధీ అని, అలాంటి మహనీయుడితో కేసీఆర్‌ను పోల్చడం గాంధీజీని అవమానించడమేనని మండిపడ్డారు. అసలు కేసీఆర్‌కు జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలన్నారు నిజంగానే కేసీఆర్ జాతిపిత అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రజల కోసం పోరాడాల్సిన ప్రతిపక్ష నేత అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఎక్కడ ఉన్నారని ఆయన నిలదీశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు నిలదీయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం సెంటిమెంట్‌ను వాడుకుని రాజకీయాలు చేయడం తప్ప ప్రజల మధ్యకు వచ్చి వారి కష్టాలను తీర్చే ఉద్దేశం కేసీఆర్‌కు లేదని ఎద్దేవా చేశారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి, అక్రమాలతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. అందుకే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించి వోటు వేయడానికి ఇష్టపడలేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కూలిపోయేలా నిర్మించడమేకాక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి దివాలా తీయించారు.. ఎన్నో స్కామ్‌లలో ఇరుక్కున్న నేతను జాతిపిత అని ఎలా పిలుస్తారని కడియం నిప్పులు చెరిగారు. అధికారం కోల్పోయినప్పటికీ బీఆర్‌ఎస్ నాయకుల ప్రవర్తనలో మార్పు రాలేదని దుయ్యబట్టారు. వారి అహంకారం, అహంభావం వల్లే ప్రజలు వారికి దూరమయ్యారని, ఇప్పటికైనా చౌకబారు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారని, ఇది ఎవరి సొత్తు కాదని గుర్తు చేశారు.
శ్రీహరీ..నోరు అదుపులో పెట్టుకో: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద
హైదరాబాద్: కడియం శ్రీహరి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కుత్బుల్లాపూర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కేసీఆర్ జాతిపిత ఎలా అవుతాడని కడియం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. శ్రీహరి తన హోదాకు మించి మాట్లాడుతున్నాడన్నారు కడియం లాగా కేసీఆర్ ఎప్పుడూ ఆత్మగౌరవాన్ని తాకట్టు బెట్టుకొని పదవుల కోసం పాకులాడి, బేరసారాలు చేయలేదన్నారు. తెలంగాణ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 13 సంవత్సరాలు నిరంతరం పోరాడాడని ఇదే శ్రీహరి అనలేదా అని సూటిగా ప్రశ్నించారు. ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడో ఆయనకే తెలియాలన్నారు. రాజకీయ అవసరాల కోసం రంగులు మార్చిన నీ లాంటి వారు కేసీఆర్‌ను అనే అర్హతల లేదని విమర్శించారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



