“ముఖ్యంగా అందరి నోళ్ళల్లో నానుతున్న కాళేశ్వరం అవినీతి. దానిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్ వేసింది మొదలు నివేదిక ప్రభుత్వానికి చేరక ముందు నుండి చేరిన తర్వాత కూడా ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉన్నది. దాన్ని కెసిఆర్ న్యాయస్థానంలో సవాల్ చేయడం వేరే విషయం. అలాగే మరో సంచల అభియోగం ఫోన్ ట్యాపింగ్. దీనిపై అధికారపార్టీ తో పాటు బిజెపి కూడా విరుచుకు పడుతున్నది. సంచలనాత్మకంగా మారిన ఆరోపణలన్నిటికీ ఆయన మౌనమే సమాధానమన్నట్లుగా వ్యవహరించడం కొరుకుడుపడని అంశంగా మారింది. ఆ మౌనం పార్టీని ఇబ్బందులకు గురిచేస్తున్నది. చాలామంది పార్టీని వీడిపోతుండగా, మరికొందరు ఆ బాట పట్టేందుకు సిద్దంగా ఉన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. అయినా ఫామ్‌హౌజ్ వీడి తమ మధ్యకు రాని అధినేత కెసిఆర్ పార్టీని కొనసాగిస్తారా? లేక రాష్ట్రమంతా కోడైకూస్తున్నట్లు బిజెపిలో కలిపే ఉద్దేశ్యమేమైనా ఉందా అన్న అనుమానాల్లో పార్టీ క్యాడర్ ఉంది. వీటన్నిటికీ కెసిఆర్ మౌనం వీడితే తప్ప సరైన సమాధానం లభించేపరిస్థితిలేదు.”
బిఆర్‌ఎస్ అనగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్పనాయకుడు కెసిఆర్ గుర్తుకు వస్తారు. అనేక అవాంతరాలు, ఒడిదొడుకులు, చిక్కుముడులను విప్పుకుని ధైర్యంగా ముందుగు సాగిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. ప్రతీ విషయానికి గాబరాబడి ఆగమాగం కావద్దన్నది ఆయన సిద్దాంతం. ప్రస్తుతం తన పార్టీ(బిఆర్‌ఎస్)లో చెలరేగుతున్న పెను తుఫాన్ పట్లకూడా ఆయన అదే సిద్దాంతాన్ని అవలంబిస్తున్నట్లు కనిపిస్తున్నది. అటు రాజకీయపరంగా ఇటు కుటుంబ పరంగా ఆయన ఇప్పుడు అనేక సవాళ్ళను ఎదుర్కుంటున్నారు. తెలంగాణ ప్రజానీకాన్ని ఏకంచేసి తెచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి గా దశాబ్ధకాలం పాలన చేసి, అనేక అవినీతి ఆరోపణలను మూటకట్టుకున్నారన్న విమర్శలను ఎదుర్కుంటున్న కెసిఆర్ అన్నిటికీ మౌనమే సమాధానమంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ప్రతిష్ట దిగజారిపోయినప్పటినుండి ఆయన ఫామ్‌హౌజ్‌కే పరిమిత మవడం అనేక విమర్శలకు దారితీస్తున్నది. తనతోపాటు కొడుకు కెటిఆర్, కూతురు కల్వకుంట్ల కవితపైన సంచలనాత్మక ఆరోపణలు వచ్చినప్పటికీ నిమ్మకు నీరెత్తనట్లుగా, తనకేమీ పట్టనట్లుగా వాటంతట అవే పరిష్కారం అవుతాయన్నట్లుగా ఆయన మౌనమునిగా వ్యవహరిస్తున్నతీరు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ అభిమానుల్లో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దోషిగా కెసిఆర్‌ను ఆయన కుటుంబాన్ని వేలెత్తి చూపుతున్నదానిలో ఎంతవరకు నిజముందన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అన్నిటికీ మించి బిజెపిలో బిఆర్‌ఎస్ కలుస్తుందంటూ రాజకీయ పక్షాలు తమ వాదాన్ని బలంగా వినిపిస్తున్నా కెసిఆర్ పట్టించుకోకపోవడమేంటన్న ప్రశ్న ప్రజల మెదళ్ళను తొలుస్తున్నది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటి నుండి అంటే దాదాపుగా రెండు సంవత్సరాలుగా నలుగుతున్న ఈ వాదనకు నేటికీ ఆ పార్టీ అధినేతగా కెసిఆర్ నుండీ గట్టి సమాధానం రాకపోవడం ఆ పార్టీ శ్రేణులను కలవరపరుస్తున్న అంశం. ఈ కలవరానికి కవిత లేఖాంశమన్నది కాదనలేని నిజం. వరంగల్‌లో భారీ బహిరంగ సభ అనంతరం తన తండ్రి కెసిఆర్‌కు కవిత రాసిన పర్సనల్ లేఖలోని అంశాలు బహిర్ఘతం కావడం పార్టీలో పెను తుఫాన్‌ను లేపింది. బిజెపిలో బిఆర్‌ఎస్ విలీనంపై పార్టీలో చర్చ జరిగిందన్న విషయాన్ని ఆ లేఖ చెప్పకనే చెబుతున్నది. ఆ లేఖ లీక్ అయిన విషయంపై కవిత స్పందించిన విధానం పార్టీని మరింత గందరగోళంలోకి నెట్టింది. కెసిఆర్ చుట్టూ ఉన్న దయ్యాల కారణంగానే తన లేఖ లీక్ అయిందంటూ ఆమె చేసిన ఆరోపణలవల్ల పార్టీ చిక్కుల్లో పడుతుందని తెలిసినా కెసిఆర్ మౌనం వీడకపోవడం నిజంగానే ఆశ్చర్యకరమైన అంశం. ఆనాటి నుండి కవిత పార్టీకి దూరంగా ఉండటం, తండ్రి, సోదరుడితో కలవకపోవడం, పార్టీ పరంగా ఎంపికైన ఎమ్మెల్సీ పదవిలోనే కొనసాగుతుండడం అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. తెలంగాణ పోరాటంతో పాటుగా జాగృతి సంస్థ నుండి కార్యక్రమాలు చేపడుతూ వచ్చిన కవిత, ఇప్పుడు పార్టీపరంగా చేయాల్సిన పోరాటాలను తన జాగృతి సంస్థ ద్వారా ముందే చేపట్టడం, సంస్థను మరింతగా విస్తరిస్తున్నప్పటికీ కెసిఆర్ ఏమాత్రం పట్టించుకోవడంలేదు.
ఈటల రాజేందర్‌పై సత్వర చర్యలు తీసుకున్న కెసిఆర్ కవితపట్ల ఎందుకు ఉదా సీనంగా వ్యవహరిస్తున్నారన్నది ప్రశ్న. కూతురు కాబట్టి ఉపేక్షిస్తున్నాడనుకున్నా పార్టీకి నష్టం వాటిల్లుతున్నా ఊరుకోవడమేంటన్న ప్రశ్న ఉత్పన్న మవుతున్నది. తాజాగా కవిత మరో లేఖాస్త్రాన్ని ప్రయోగించింది. తనపైన రాజకీయంగా కుట్ర జరుగుతున్నది అందులోని సారాంశం. తండ్రి, అన్నతో సఖ్యతగా ఉన్నప్పుడు తెలంగాణ బొగ్గుగని కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఎంపికై కొనసాగుతున్న కవితను ఆ పదవినుండి తొలగించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను తాజాగా ఆ పదవిలో పార్టీ నియమించింది. దాంతో ఆమె మరోసారి తీవ్ర ఆగ్రహానికి గురైంది. తనను తొలగించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నది వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నానంటు సింగరేణి కార్మికుల సంఘానికి రాసిన లేఖలో కవిత పేర్కొంది. విచిత్రమేమంటే గతంలో తన తండ్రి కెసిఆర్‌కు పర్సనల్‌గా రాసిన లేఖ లీక్ అయింది ఆమె అమెరికాలో ఉన్నప్పుడు.కాగా ఇప్పుడు సింగరేణి బొగ్గు గని కార్మికుల సంఘం గౌరవ అధ్యక్ష పదవి నుండి తనను తొలగించింది కూడా ఆమె అమెరికాలో ఉన్నప్పుడు కావడం యాదృశ్చికమో లేక ఆమె లేనప్పుడు కావాలని చేపట్టిన చర్యలా అన్నది అంతుపట్టనిది.
ALSO READ: కెసిఆర్ పాలనలో యూరియా కొరత లేదు
సింగరేణి కార్మికులను తెలంగాణ పోరాటం వైపుకు నడపడంలో కవిత పాత్ర ఉంది. 2015 ఆగస్టు 17న కొత్తగూడలో నిర్వహించిన టిజీజీకెఎస్ జనరల్‌బాడీ సమావేశంలో 11 ఏరియాల నుండి హాజరైన వెయ్యిమంది కార్మికుల సమక్షంలో కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఎంపికైంది. అయితే తనను తొలగించడం కార్మికుల ఐక్యతను, శ్రేయస్సును దెబ్బతీయడమేనంటారామె. దీని వెనుక కూడా గత లేఖ కదనమే ఉందంటున్న కవిత, తన లేఖను ఎవరు లీక్ చేశారని నిలదీయటంవల్లే రాజకీయంగా తనను దెబ్బతీయాలన్న కక్ష కట్టారన్నది కవిత ఆరోపణ. ఇంత జరుగుతున్నా కెసిఆర్ తన మౌనాన్ని వీడటంలేదు. దిల్లీ లిక్కర్‌కేసులో ఆరునెలలపాటు కవిత జైల్ జీవితాన్ని అనుభవించిన తరుణంలోకూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనందాల్చడమన్నది నిజంగా ఆయన మానసిక స్థైర్యానికి నిదర్శనం. అలాగే కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కూడా అనేక ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అందులో ప్రధానమైంది కార్ రేసింగ్. ఇందులో అవినీతి జరిగిందంటూ అధికారపార్టీ ఒకపక్క విచారణ జరుపుతుంటే, మరో పక్క కాంగ్రెస్ మంత్రులు ఆయన నడవడికపైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నా, అవుననికాని, కాదనికాని కెసిఆర్ ఇవ్వాల్టికీ మాట్లాడకపోవడం విచిత్రమే. మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణ బిఆర్‌ఎస్ పార్టీకే కాకుండా కెసిఆర్ కుటుంబానికే గొడ్డలిపెట్టుగా మారినప్పటికీ కెసిఆర్ మౌనం వీడలేదు.
ఇదిలాఉంటే కాంగ్రెస్ అధికారం చేపట్టిన దాదాపు ఈ పద్దెనిమిది నెలల కాలంలో కెసిఆర్ పైన దుమ్మెత్తి పోయని రోజంటూ లేదు. అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొదలు, ఆయన మంత్రివర్గం, ఇతర నాయకులు నిత్యం ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ ఆరోపణలు కేవలం రాష్ట్రం వరకు పరిమితం కాకుండా దిల్లీ స్థాయి నాయకులు అవకాశం వచ్చినప్పుడల్లా ఎత్తిచూపుతూనే ఉన్నారు. ముఖ్యంగా అందరి నోళ్ళల్లో నానుతున్న కాళేశ్వరం అవినీతి. దానిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్ వేసింది మొదలు నివేదిక ప్రభుత్వానికి చేరక ముందు నుండి చేరిన తర్వాత కూడా ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉన్నది.
దాన్ని కెసిఆర్ న్యాయస్థానంలో సవాల్ చేయడం వేరే విషయం. అలాగే మరో సంచల అభియోగం ఫోన్ ట్యాపింగ్. దీనిపై అధికారపార్టీ తో పాటు బిజెపి కూడా విరుచుకు పడుతున్నది. సంచలనాత్మకంగా మారిన ఆరోపణలన్నిటికీ ఆయన మౌనమే సమాధానమన్నట్లుగా వ్యవహరించడం కొరుకుడుపడని అంశంగా మారింది. ఆ మౌనం పార్టీని ఇబ్బందులకు గురిచేస్తున్నది. చాలామంది పార్టీని వీడిపోతుండగా, మరికొందరు ఆ బాట పట్టేందుకు సిద్దంగా ఉన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. అయినా ఫామ్‌హౌజ్ వీడి తమ మధ్యకు రాని అధినేత కెసిఆర్ పార్టీని కొనసాగిస్తారా? లేక రాష్ట్రమంతా కోడైకూస్తున్నట్లు బిజెపిలో కలిపే ఉద్దేశ్యమేమైనా ఉందా అన్న అనుమానాల్లో పార్టీ క్యాడర్ ఉంది. వీటన్నిటికీ కెసిఆర్ మౌనం వీడితే తప్ప సరైన సమాధానం లభించేపరిస్థితిలేదు.





