– రెండేళ్లలో జిల్లా ఆగమాగం
– మిషన్ భగీరథ కింద జిల్లాకు స్వచ్ఛమైన మంచినీరు
– బీఆర్ ఎస్ హయాంలోనే మౌలిక సదుపాయాలు
– హల్దీ వాగుపై చెక్‌డ్యాం నిర్మించిన బీఆర్ ఎస్ ప్రభుత్వం
– మరి మెదక్ జిల్లాకు కాంగ్రెస్ ఏం చేసింది?
– ప్రశ్నిస్తున్నందుకు సిట్ నోటీసులు
– మాజీ మంత్రి హరీష్‌రావు
మెదక్, ప్రజాతంత్ర, జనవరి 22: దశాబ్దాల మెదక్ జిల్లా కలను సాకారం చేసి, అభివృద్ధి పథంలో నడిపించింది కేసీఆర్ గారైతే.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మెదక్ ను ఆగం చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు అన్నారు. గురువారం మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా గాంధీ హయాం నుంచి 40 ఏళ్లుగా మెదక్ జిల్లా గురించి కాంగ్రెస్ పార్టీ ఊరించింది తప్ప జిల్లాను చేయలేదు. కానీ కేసీఆర్ మాట ఇచ్చి, మెదక్ ను జిల్లాగా చేసి చూపించారన్నారు. ఒకప్పుడు వారానికి ఒకసారి మంచినీళ్లు వచ్చే మెదక్ లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన మంజీరా జలాలు అందించామని గుర్తుచేశారు. కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, 100 పడకల ఆసుపత్రి, మెడికల్ కాలేజీ, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, మైనార్టీ స్కూల్స్, రైతు బజార్, గ్రంథాలయం, షాదీఖానా.. ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలోనే వచ్చాయి. మెదక్ కు రైలు తెచ్చింది, పట్టణంలో నాలుగు లైన్ల రోడ్లు వేసింది, ఘనపురం కాలువలను ఆధునీకరించింది, హల్దీ వాగుపై చెక్ డ్యాములు కట్టింది కేసీఆర్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయింది. మెదక్ అభివృద్ధి కోసం చేసిన ఒక్క పనిని చూపించగలరా?కాంగ్రెస్ పాలన మెదక్ ను అధ్వాన్నంగా మార్చిందన్నారు. మైనార్టీలకు 4000 కోట్లు బడ్జెట్ పెడతామని మోసం చేశారు. ఇమామ్, మౌజంలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఘనపురం ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి తీసుకొచ్చారన్నారు. కేసీఆర్ రైతుబంధు నిధులు నాట్లకు ఇస్తే రేవంత్ రెడ్డి కేవలం ఓట్ల కోసమే ఇస్తున్నారని ఆరోపించారు. ట్రాఫిక్ చలాన్ల పేరుతో ప్రజలకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్ల నుండి డబ్బులు కట్ చేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. నువ్వు ముఖ్యమంత్రివా లేక సైబర్ నేరగానివా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తే రేవంత్ రెడ్డి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అవ్వతాతలకు రూ.50 వేల పెన్షన్ఆ, డబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద రూ.62,500 బాకీ పడ్డారు. మొన్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చీరలు పంచుతుంటే మహాలక్ష్మి పైసలు ఎప్పుడు ఇస్తావని మహిళలు నిలదీశారు. ఇంకో మంత్రి వివేక్ చెన్నూరులో పర్యటిస్తుంటే ఈ రోడ్ ఎట్లుంది? వీధి దీపాలు ఇవ్వమని ప్రజలు తిరగబడ్డారు. మధిరలో ఉప ముఖ్యమంత్రి భట్టి మీద మహాలక్ష్మి డబ్బులు ఎప్పుడు ఇస్తారని మహిళలు తిరగబడ్డారు. హైదరాబాదులో తిరుగుతున్న పొన్నం ప్రభాకర్ ను నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు నాపై, కేటీఆర్ పై సిట్ నోటీసులు ఇస్తున్నారన్నారు. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం. రైతు రుణ మాఫీ అయ్యేదాకా, అవ్వాతాతలకు రూ.4000 ఇచ్చేదాకా అడుగుతాం. తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంటపడుతూనే ఉంటామన్నారు. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నిన్ను వదిలిపెట్టమని స్పష్టం చేశారు. మెదక్ లో కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే మన జిల్లాను మనమే రద్దు చేసుకోవడం. మన కంటిని మనమే పొడుచుకున్నట్టని అన్నారు. రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాను రద్దు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మెదక్ జిల్లా జిల్లాగానే ఉండాలన్నా, అభివృద్ధి కొనసాగాలన్నా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించి రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





