– బతుకమ్మను ప్రార్థించిన కేసీఆర్
– ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29: కష్టాలన్నీ తొలగి ప్రతి ఇల్లూ సుఖసంతోషాలతో నిండేలా ప్రకృతిమాత బతుకమ్మ దీవెనలు అందించాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రార్థించారు. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పూల పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకుని చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసే సాంస్కృతిక సంప్రదాయం బతుకమ్మ పండుగ అని అన్నారు. ఇది తెలంగాణకు ప్రత్యేకం అని తెలిపారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల ఆత్మగౌరవాన్ని చాటే పండుగ బతుకమ్మ: కేటీఆర్
తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు (కేటీఆర్) రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు సోమవారం ఒక ప్రకటనలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించి, గౌరమ్మను భక్తితో కొలిచే సబ్బండ వర్ణాల సంబురం బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు. ఈ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని తెలిపారు. పువ్వులను దేవతగా పూజించే ఈ ఉత్సవం.. తెలంగాణ సంస్కృతి, మన అస్తిత్వం, ప్రకృతితో మనకున్న అనుబంధానికి అద్దం పడుతుందని, ప్రపంచానికి మన విశిష్ట సంస్కృతిని చాటిచెప్పే గొప్ప పండుగ ఇదేనని ఆయన కొనియాడారు. ఈ పండుగ ప్రతి ఇంటా సంతోషాన్ని, సిరిసంపదలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి ఆడపడుచు జీవితంలో ఆనందం, సౌభాగ్యం నిండుగా ఉండాలని, అందుకు ఆ బతుకమ్మ తల్లిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





