– బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– తెలంగాణ భవన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు
– 72 కిలోల కేక్ కట్ చేసిన పార్టీ నేతలు
– ఉద్యమ నేపథ్య పాటలు, డాక్యుమెంటరీ విడుదల
– కేసీఆర్ మళ్లీ సిఎం అవుతారన్న మాజీ మంత్రి తలసాని
హైదరాబాద్,ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: మాది కేసీఆర్ లాంటి టైగర్ల జాతి.. నీది మరి ట్రెయిటర్ల జాతి.. గుర్తుపెట్టుకో అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినుద్దేశించి అన్నారు. తను జాతిపితనని కేసీఆర్ ఎన్నడూ చెప్పుకోలేదు.. ప్రజలు పిలుచుకున్నారు.. ఏ జాతి నీది? ఏ జాతికి జాతిపిత అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తా ఉన్నా అన్నారు. బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయి. ఒకటి తెలంగాణవాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి. ఎవరైతే స్వాతంత్య్రం తెచ్చిండో తమ జాతికి ఆయనను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారని స్పష్టం చేశారు.పెద్ద మనిషి, మా తెలంగాణకు బాపు లాంటి పెద్దమనిషి కాబట్టే ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం.. సాధారణంగా ఏ తండ్రి అయినా ఆ కొడుకుకు, ఆ పిల్లలకు హీరోగా ఉంటారు.. కానీ నా తండ్రి ఇవాళ తెలంగాణకు హీరో, అది తెలంగాణ జాతికి మొత్తానికి హీరో. ఇది వాస్తవం అని చెప్పారు. కొంతమంది మాట్లాడుతున్నారు ఆనవాళ్లు చెరిపేస్తామని. కేసీఆర్ జన్మదిన సందర్భంగా నేను చెప్తా ఉన్నా తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్లు కదా..! తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్లు కదా..! దాన్ని ఎట్లా చెరిపేస్తావురా సన్నాసి..? నువ్వు మమ్మల్ని ఎన్ని తిట్టినా, ఎన్ని బూతులు మాట్లాడినా ఒకటి మాత్రం వాస్తవం.. ఆయన ఒక శిఖరం.. నువ్వు ఒక శునకం. నీ స్థాయి గదే.. నీ బతుకు గదే. అందుకే నీకంటే ఇవాళ తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసనన్నారు. మాజీ మంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, యువ నాయకులు తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు కేటీఆర్, డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు అతిథులుగా హాజరయ్యారు. కేసీఆర్ 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని 72 కిలోల భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమం నేపథ్యంతో రూపొందించిన పాటలు, డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. పదేళ్ల పాలనలో దేశం అబ్బురపడే విధంగా అనేక పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని పేర్కొన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికారంలో ఉన్నామని దౌర్జన్యాలు చేస్తామంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు గతంలో ఏ ముఖ్యమంత్రి ప్రచారం చేయలేదని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించినా, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడినా చెప్పుకోదగ్గ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ సాధించలేదని విమర్శించారు. మూడేళ్ళ తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, తెలంగాణ భవన్ ఇంచార్జి రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమ కారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





