– చావుకు సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించారు
– తెలంగాణకు రక్షకుడయ్యారు
– చరిత్రలో కేసీఆర్ చిరస్థాయిగా నిలుస్తారు
– కేసీఆర్ జన్మదిన వేడుకల్లో హరీశ్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: నేడు ఒక నాయకుడి పుట్టిన రోజు కాదు.. ఉద్యమం పుట్టిన రోజు అని బీఆర్ఎస్‌ఎల్పీ ఉప నేత హరీష్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ, ఆత్మగౌరవంతో ఈ జాతి బతుకుతున్నది అంటే దానికి కారకుడు కేసీఆర్ అని అన్నారు. జాతి ఆత్మగౌరవాన్ని రూపుమాపే కుట్రలతో, తెలంగాణ ప్రాంతం మాది అని చెప్పుకోలేని దుస్థితిలో, తెలంగాణ అన్యాయం గురించి శాసనసభలో మాట్లాడే అవకాశం లేనప్పుడు, యాస, భాష, జాతి గౌరవం దెబ్బతిన్న సమయంలో తెలంగాణకు రక్షకుడిలా నేనున్నానంటూ కేసీఆర్ ఉద్యమించారని తెలిపారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేదా అని ప్రశ్నించారు. ఎంతోమంది ఉద్యమం చేసినా గమ్యాన్ని చేరుకోలేకపోయారని, కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని ఎత్తిన జెండా దించకుండా నినదించారని, చావునోట్లో తలపెట్టి ప్రాణాన్ని సైతం వదులుకోవడానికి సిద్దపడి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. కేసీఆర్ జన్మదినం అంటే రాష్ట్ర ప్రజలందరికి పర్వదినమని అన్నారు. చరిత్రలో చాలామంది ఉంటారు .. కానీ చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచే నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని త్యాగాల పునాదుల మీద కేసీఆర్ సాధించారని, ఆయన చేసిన త్యాగాలు ఇన్నీఅన్నీ కావని తెలిపారు. అయితే నేడు ఒక కౌన్సిలర్ పదవి కోసం కాంగ్రెస్, బీజేపీ పొత్తులు పెట్టుకున్నాయని విమర్శించారు. పదవి కోసం సిద్దాంతాలు పక్కన పెట్టి ఆ రెండు పార్టీలు ఎలా కలిసాయో చూసామన్నారు. కానీ కేసీఆర్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రి పదవులను గడ్డి పోచలుగా త్యాగం చేసి రాష్ట్రాన్ని సాధించారన్నారు. ఆ త్యాగం, ఆ ధైర్యం లేకుంటే తెలంగాణ వచ్చేది కాదంటూ కేసీఆర్ పడినన్ని పాట్లు, ఆయనపై జరిగిన కుట్రలు చరిత్రలో ఏ నాయకుడి మీద జరిగి ఉండకపోవచ్చునన్నారు. మొండి ధైర్యంతో ముందుకు సాగారు కాబట్టి తెలంగాణ సాధ్యమైందని హరీష్‌రావు తెలిపారు. ఏ ప్రలోభాలకూ తలొగ్గకుండా ప్రాణాన్ని సైతం వదిలేందుకు సిద్దపడ్డడు.. నిమ్స్‌లో ఆయన చివరి దశలో ఉన్నడు.. ఆయన్ని ఒప్పించి నిరాహార దీక్ష మాన్పించండి అని మాకు డాక్టర్లు చెబితే మా కండ్లలో నీళ్లు తిరిగాయి అని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మాత్రం అదే మొండి దైర్యం చూపారని, దీక్ష విరమించాలని చెప్పడానికి తన వద్దకు రావద్దన్నారని తెలిపారు. అయితే తెలంగాణ జైత్రయాత్ర, లేదంటే నా శవయాత్ర అని బయల్దేరాను.. దానికే కట్టుబడి ఉన్నానని చెప్పారన్నారు. అదే పట్టుదలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని, తెలంగాణ వాళ్లకు పాలన రాదు అనే స్థాయి నుంచి తెలంగాణ ఆచరిస్తది, దేశం అనుసరిస్తది అనే స్థాయికి చేర్చిండని హరీష్‌రావు తెలిపారు. కేసీఆర్ ఉద్యమకారుడు, కేసీఆర్ చరిత్రకారుడు, పాలనాదక్షుడు.. చరిత్ర పుటల్లో నిలిచిండు అని చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు దేశానికి దిక్సూచి అయ్యాయన్నారు. అవ్వాతాతలకు ఆసరా పింఛన్లు ఇచ్చిన పెద్ద కొడుకు కేసీఆర్.. ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి ఇచ్చిన తోబుట్టువు కేసీఆర్.. కేసీఆర్ కిట్టు ఇచ్చి మేనమామ అయ్యాడు.. కేసీఆర్ కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కరెంట్ ఇచ్చి రైతన్నలకు తోడుగా నిలిచిండు అని వివరించారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇదంతా ఒక చరిత్ర.. అలాంటి కేసీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనన్నారు. తనలాంటి వారికి 25ఏళ్లు ఉద్యమంలో, ప్రభుత్వంలో, ప్రతిపక్షంలో వారి అడుగుజాడల్లో నడిచే అవకాశం కల్పించారన్నారు. కార్యకర్తలుగా, నాయకులుగా, చట్ట సభల్లో సభ్యులుగా తీర్చిదిద్దిండు కేసీఆర్.. అటువంటి కేసీఆర్‌కి అందరి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఓటమి తాత్కాలికం.. మళ్లీ కేసీఆర్ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు.. అందరి ప్రార్థనలతో, దేవుడి ఆశీస్సులతో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు.. అందరం ఒక్క తాటిపై నడుద్దాం.. కేసీఆర్‌ని ముఖ్యమంత్రి చేసుకుందాం అని హరీష్‌రావు పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





