– అవి రాష్ట్ర అభివృద్ధి కోసమే వినియోగించారు
– సీఎం రేవంత్ ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు
– రైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు
– జిల్లా మంత్రులు కమీషన్‌లకు కక్కుర్తిపడుతున్నారు
– వారితో జిల్లాకు ఏమాత్రం ఉపయోగంలేదు
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 7: తెలంగాణకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అద్భుతమైన ప్రాజెక్టులు తీసుకొచ్చారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవమేనంటూ ఆ అప్పు రాష్ట్రాభివృద్ధి కోసమే వినియోగించారని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు.ఇటీవల ఖమ్మం జిల్లాలో గెలిచిన బీఆర్‌ఎస్ సర్పంచ్‌లతో బుధవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన ఫ్రస్టేషన్‌లో ఉన్నారని, ఆయనలో అంత ఫ్రస్టేషన్ ఎందుకో తనకు అర్థం కావడం లేదని అన్నారు. సెక్యూరిటీ వాళ్ళతో పాటు పోలీసుల్ని సైతం ఆయన కొడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రస్టేషన్‌లో ఉన్నాడు.. అరుస్తున్నాడు.. కొడుతున్నాడు.. రేపు ఎవరినైనా కరుస్తాడేమో జాగ్రత్త అంటూ సీఎం భార్యకు సూచనలు చేశారు. కాంగ్రెస్ అగ్ర నేతలకు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ కీలక నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్న క్రమంలో కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రైతుబంధు ఏమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే లాగులో తొండలు వదులుతాం అంటున్నారని మండిపడ్డారు. ఎప్పటికప్పుడు దిల్లీకి పోయి కప్పం కట్టి వస్తున్నారని విమర్శించారు. దిల్లీలో కప్పం కట్టకపోతే తన పదవి ఉండదని.. ఊడిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్‌కు తెలుసునన్నారు. తాను ఆంధ్రప్రదేశ్ వెళ్లి చదువుకుంటే తప్పు.. ఆయన మాత్రం ఆంధ్రాలోని భీమవరం వ్యక్తిని అల్లుడిగా తెచ్చుకోవచ్చు నంటూ కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు. తాను అమెరికాలో బాత్‌రూమ్‌లు కడుక్కుంటున్నానని అన్నారు. మరి అమెరికాలో సోదరుడు జగదీష్ రెడ్డి కూడా ఉన్నాడని, ఆయన తన ఇంట్లో తానే కడుక్కోవట్లేదా అంటూ అమెరికాలో ఎవరింట్లో పనులు వాళ్ళే చేసుకుంటారని.. ఈ విషయం తెలయకుంటే తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఈ పనికి మాలిన డైలాగుల కోసం కాదని.. పనిచేసి చూపించాలని హితవు పలికారు. యూరియా బస్తాల కోసం ప్రతి రోజూ షాపుల ముందు రైతులు క్యూ కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షాపుల్లో యూరియా లేనప్పుడు అందుకోసం రూపొందించిన యాప్‌లు ఏమి చేస్తాయంటూ కేటీఆర్ ప్రశ్నించారు. యూరియా అంశంలో యాప్‌ల సమస్య రావడంతో కొత్తగా మళ్ళీ కార్డులు తీసుకొస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు.
ముగ్గురు మంత్రులున్నా జిల్లాకు ఒరిగిందేమీ లేదు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చి రెండేళ్లయినా ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ఇక్కడి ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. నాడు ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ సీతారామసాగర్ ప్రాజెక్టును తలపెట్టి 90 శాతం పనులను పూర్తిచేశారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో 7.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని, గోదావరి జలాలపై పూర్తి హక్కులు ఖమ్మం జిల్లాకే దక్కాలని నాడు కేసీఆర్ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును గాలికి వదిలేసిందని విమర్శించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కమీషన్‌లకు కక్కుర్తిపడి ప్రాజెక్టును పక్కనపెట్టారని మండిపడ్డారు. అధికారంలోకి వొచ్చి రెండేళ్లయినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. అశ్వారావుపేటలో ఒక్క సీతారామసాగర్ ప్రాజెక్టు ద్వారా 1.30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా కేసీఆర్ డిజైన్ చేశారని చెప్పారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు, ఇల్లందు నియోజకవర్గంలో 20 వేల ఎకరాలకు, కొత్తగూడెంలో 10 వేల ఎకరాలకు, వైరాలో 20 వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా కేసీఆర్‌గారు సీతారామ ప్రాజెక్టును డిజైన్ చేశారన్నారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం చేసింది ఏమైనా ఉందంటే అది ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్, రాజ్యసభ సభ్యుడు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





