– అవినీతిని పట్టుకోవడంలో సీఎం రేవంత్ విఫలం
– కవితకు ప్రజాదరణ ఉంటే ఆదరిస్తారు
– మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 28: కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మరోసారి రాష్ట్ర ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారశైలి, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం, కవిత కొత్త పార్టీ, తాజా రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ అతిపెద్ద ఇంజనీర్. టోపి పెట్టుకొని ప్రాజెక్టును డిజైన్ చేసింది ఆయనే. ఈ ప్రాజెక్టు కుంగి పోవడానికి, ప్రజా ధనం వృథా కావడానికి కేసీఆర్ నిర్ణయాలే కారణం. ప్రజలు ప్రతి విషయాన్నీ గమనించి సరైన నిర్ణయం తీసుకుంటున్నారు అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవడంలో అధికార ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో కుమ్మక్కయ్యారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష తెలంగాణ సమాజం తలదించుకునేలా ఉంది. ప్రజలు సైతం ఆయన భాషపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆయన వ్యవహార శైలి మార్చుకుంటే మంచిదన్నారు. ముఖ్యమంత్రికి ఎన్నికల ముందు గుడ్లు గుర్తుకు వస్తాయి. గాడిద గుడ్లు అంటారు. ఎన్నికలు అయిపోయాక తొండలు గుర్తుకు వస్తాయి. తొక్కుడు గుర్తుకు వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ కలిసే రాజకీయం చేస్తారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి దిగజారిపోయి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తున్నారు. ఆయన తెలంగాణకి ముఖ్యమంత్రి.. ఉత్తరాది రాష్ట్రాల నాయకుడు కాదు. ఆయన వ్యవహార శైలి మార్చుకుంటే మంచిదన్నారు. ముందు మీరు ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చెయ్యాలి. కేంద్రం ఏమిస్తున్నదో ప్రజానీకానికి తెలుసు. రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగాలేదు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడతారనే ప్రచారంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఇది సంకేతం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ స్థాపించే హక్కు కలిగి ఉంటారు. అది వారి వ్యక్తిగత, రాజకీయ స్వేచ్ఛకు సంబంధించింది. కవిత కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనను స్వాగతిస్తున్నాం అని అన్నారు. ప్రజలకు ఉపయోగపడితే ఆ పార్టీలను వారు స్వాగతిస్తారన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





