కేసీఆర్‌ అసెంబ్లీలో చర్చకు వస్తారా?

– పాలమూరు-రంగారెడ్డిపై మాట్లాడతారా
– రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఇదే చర్చ
– 2న తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబరు 30: బీఆర్‌ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ‌తొలిరోజు అసెంబ్లీకి వచ్చారు. 2న తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు వస్తారా అని అందరిలోనూ ఆస‌క్తి నెల‌కొని వుంది. అసెంబ్లీలో ఆయన మాట్లాడితే చూడాలని కూడా చాలామంది అభిప్రాయంగా ఉంది. కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు హజరవుతారా లేదా అంటూ గత కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో చ‌ర్చ‌ జరుగుతున్న వేళ సోమవారం అసెంబ్లీకి వచ్చారు. కొద్దిసేపు మాత్రమే ఉండి వెళ్లిపోయారు. ఆయనకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆయన అసెంబ్లీకి రావ‌డంతో  గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. అయితే మొద‌టి రోజు ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన కేసీఆర్‌ ‌తిరిగి కొత్త సంవత్సరం రెండో రోజు నుంచి జరిగే సమావేశాలకు వస్తారా లేదా అనే కొత్త చర్చ రాజకీయవర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో మొదలైంది. కేసీఆర్‌ ‌తప్పకుండా సభకు వస్తారని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాల అంశంపై మాట్లాడతారని బీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు గట్టిగా నమ్ముతున్నాయి. ఎందుకంటే కేసీఆర్‌ ‌వస్తారని, మాట్లాడతారని కొంత కాలంగా హరీష్‌ ‌రావు, కేటీఆర్‌లు ‌చెబుతూ వచ్చారు. సోమవారం కేసీఆర్‌ ‌శాసనసభకు రావడం ఖరారు కావడంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఉదయమే పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు స్వాగతం పలికేందుకు వేచి ఉన్నారు. దాంతో అక్కడంతా హడావుడి కనిపించింది. బీఆర్‌ఎస్‌ ‌ముఖ్య నేతలు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు, తదితరులు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. ఆయన మొదట అసెంబ్లీ లాబీలో తనకు కేటాయించిన ప్రతిపక్ష నేత ఛాంబర్‌లోకి వెళ్లారు. అక్కడే సభకు సంబంధించిన హాజరు నమోదు పత్రంలో సంతకం చేశారు. తర్వాత అసెంబ్లీ హాల్లోకి వెళ్లి కూర్చున్నారు. కొద్ది నిమిషాల్లోనే తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాల అంశంపై చర్చ జరుపుదామని, కేసీఆర్‌ ‌సభకు రావాలంటూ అధికార పార్టీ నేతలు సవాల్‌ ‌విసురుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 2 లేదా 3వ తేదీన కేసీఆర్‌ ‌శాసనసభకు వస్తారని బీఆర్‌ఎస్‌ ‌వర్గాలు తెలిపాయి. అసెంబ్లీలో చర్చించే అంశాలపై స్పష్టత వచ్చాక కేసీఆర్‌ ‌పాల్గొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా, గత ప్రభుత్వాల ప్రతిపాదనలు, బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్‌ ‌మాట్లాడతారని సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌ ‌సర్కార్‌ అనుసరిస్తున్న వైఖరి వల్ల రెండు జిల్లాల రైతులకు ఎలాంటి నష్టం జరగనుందో కేసీఆర్‌ ‌ప్రస్తావిస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇదే అంశంపై క్షేత్రస్థాయి కార్యాచరణ సిద్ధం చేసి ప్రజల్లోకి వెళ్తారని అంటున్నారు. రెండు అంశాలపై అసెంబ్లీ వేదికగా ఏం చెప్పాలి? ఇప్పటివరకు ఎదురైన ఇబ్బందులు, భవిష్యత్‌లో ఏర్పడే ప్రమాదాలు వంటి వాటిపై కేసీఆర్‌ ‌సంబంధిత నిపుణులతో చర్చలు జరుపుతూ సన్నద్ధం అవుతున్నారని పార్టీ ‌సీనియర్‌ ‌నేత ఒకరు తెలిపారు. కాగా, విపక్షనేతగా ఈ రెండేళ్ల కాలంలో అసెంబ్లీలో కేసీఆర్‌ కనిపించలేదు. కేవలం సంతకం పెట్టి వెళ్లిపోయారు. కనీసం ఇప్పుడైనా రాకుంటే ఇక బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో నమ్మకం ఉండ‌ద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *