– ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతలను నిర్మించిన నేత
– వ్యవసాయంలో తెలంగాణను అగ్రస్ధానానికి చేర్చిన నాయకుడు
– దేశంలో మొదటిసారి ఇంటింటికి నల్లాలు
– రైతుబంధు అందించిన ఏకైక నాయకుడు
– ప్రజాయోధుడు పుస్తకావిష్కరణలో కె.టి.ఆర్
తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించే సన్నాసులకు 25 ఏండ్ల క్రితం ఈ గడ్డపై ఉన్న నిర్భంద పరిస్థితులు ఏ మాత్రం తెలియవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు అన్నారు. శుక్రవారం మహేంద్ర తోటకూరి రాసిన ప్రజా యోధుడు పుస్తకాన్ని తెలంగాణ భవన్‌లో ఆవిష్కరించి అనంతరం ప్రసంగించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ పుస్తకావిష్కరణ జరగడం సముచితమని, తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా కేసీఆర్ కి ఇది గొప్ప కానుక అన్నారు. తెలంగాణకు బద్ద వ్యతిరేకి అయిన చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుకుంటే రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచించడమే దుస్సాహసమన్నారు. శూన్యం నుంచి సునామీని సృష్టించినట్టుగా తెలంగాణ రానే రాదన్న అనుమానాలను పటాపంచలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కారణ జన్ముడు కేసీఆర్ అన్నారు. తల్లికి జన్మనిచ్చిన తనయుడు అని కేసీఆర్ ను ప్రజాకవి గోరటి వెంకన్న ప్రశంసించడం ఏమాత్రం అతిశయోక్తి కాదన్నారు. కేసీఆర్ అప్పులు చేశారని రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు చేస్తున్న తప్పుడు ప్రచారానికి చెంప దెబ్బ లాంటి సమాధానాన్ని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు కేటీఆర్. పదేండ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం కేవలం ₹2.80 కోట్లు మాత్రమేనని సాక్షాత్తు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి, తెలంగాణ ఖ్యాతిని హిమాలయాల ఎత్తుకు తీసుకెళ్లిన నాయకుడు కేసీఆర్ అన్న కేటీఆర్, వ్యవసాయంలో 14వ స్థానంలో ఉన్న తెలంగాణను నంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చారని గుర్తుచేశారు. భారతదేశంలో మొదటిసారి ఇంటింటికి నల్లానీళ్లు ఇచ్చి ఆడబిడ్డల కష్టాన్ని తీర్చడం తో పాటు నల్గొండలో ఫ్లోరోసిస్ మహమ్మారిని శాశ్వతంగా తుడిచిపెట్టిన నాయకుడు కేసీఆర్ అన్నారు.





