కాజీపేట రైల్వే డివిజ‌న్‌ను ఏర్పాటు చేయాలి

-పెద్ద‌ప‌ల్లి-నిజామాబాద్ సెక్ష‌న్ ను బ‌దిలీ చేయొద్దు
– రైల్వే మంత్రి అశ్వ‌నీ వైష్ణ‌వ్‌కు లేఖ రాసిన కేటీఆర్‌
– మంత్రికి అంద‌చేసిన బీఆర్ ఎస్ ఎంపీలు
– సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 1: సికింద్రాబాద్ డివిజన్‌పై ఉన్న భారం వల్ల నిర్ణయాల్లో జాప్యం, భద్రతా పర్యవేక్షణలో సవాళ్లు ఎదురవుతున్నందున‌ కాజీపేట డివిజన్ ఏర్పాటుతో వికేంద్రీకరణ జరుగుతుందని, తద్వారా ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో రైల్వే సేవలు మెరుగుపడటమే కాక సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుంద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వ‌నీ వైష్ణ‌వ్‌కు లేఖ రాశారు. కేవలం 900 కి.మీ పరిధి ఉన్న గుంటూరును ప్రత్యేక డివిజన్ గా ఏర్పాటు చేసిన అంశాన్ని ప్రస్తావించిన కేటీఆర్ కాజీపేట కేంద్రంగా నూతన రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ లేఖను పార్టీ ఎంపీల బృందం ఈ రోజు కేంద్ర మంత్రికి స్వయంగా అందజేశారు. కాజీపేట డివిజన్ ఏర్పాటుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. దక్షిణ మధ్య రైల్వేలో జరుగుతున్న అంతర్గత పునర్వ్యవస్థీకరణ, దక్షిణ తీర రైల్వే కార్యకలాపాల ప్రారంభం వల్ల సికింద్రాబాద్ డివిజన్‌పై పనిభారం విపరీతంగా పెరిగిందని కేటీఆర్ తన లేఖలో ఎత్తిచూపారు. తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ పరిధి 2,755 ట్రాక్ కిలోమీటర్లుగా ఉందని, రాబోయే కాలంలో వాడి-రాయచూర్ మరియు విష్ణుపురం-బీబీనగర్ డబ్లింగ్ పనులు పూర్తయితే ఇది సుమారు 3,150 కిలోమీటర్లకు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఇది భారతీయ రైల్వేల పరిపాలనా ప్రమాణాల ప్రకారం ఒక డివిజన్‌కు ఉండాల్సిన పరిమితి కంటే చాలా ఎక్కువని వివరించారు. మిగతా డివిజన్లతో పోలిస్తే సికింద్రాబాద్‌పై ఉన్న ఒత్తిడిని కేటీఆర్ వివరిస్తూ విజయవాడ, గుంతకల్ డివిజన్లు సుమారు 2,200 ట్రాక్ కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండగా, గుంటూరు డివిజన్ కేవలం 900 కిలోమీటర్ల లోపే ఉందని గుర్తుచేశారు. అనేక చోట్ల ప్రతిపాదిత కాజీపేట డివిజన్ కన్నా తక్కువ కిలోమీటర్లు ఉన్న డివిజన్లను ఏర్పాటు చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ భారీ అసమతుల్యత వల్ల సికింద్రాబాద్ డివిజన్ నిర్వహణ అత్యంత సంక్లిష్టంగా మారిందని, ఇది రైళ్ల రాకపోకల సాంద్రతపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే కాజీపేట కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేయడం అటు పరిపాలన సౌలభ్యం, ఇటు కార్యకలాపాల రీత్యానూ అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ప్రతిపాదిత కాజీపేట డివిజన్‌లో కాజీపేట–బల్లార్షా, పెద్దపల్లి–నిజామాబాద్, కాజీపేట–ఎర్రుపాలెం, డోర్నకల్–మణుగూరు & సత్తుపల్లి వంటి కీలక మార్గాలను చేర్చడం ద్వారా సుమారు 2,000 కి.మీ నెట్‌వర్క్‌ను సమర్థవంతంగా నిర్వహించవచ్చని సూచించారు. రైల్వే శాఖ ప్రస్తుతం పరిశీలిస్తున్న కొన్ని మార్పులపై కూడా కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెద్దపల్లి-నిజామాబాద్ సెక్షన్‌ను హైదరాబాద్ డివిజన్‌కు బదిలీ చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, భౌగోళిక సామీప్యత దృష్ట్యా దానిని కాజీపేట డివిజన్‌లోనే ఉంచాలని డిమాండ్ చేశారు. లాతూర్ రోడ్-పర్లీ వైజనాథ్ సెక్షన్‌ను నాందేడ్ డివిజన్‌కు మార్చే అంశాన్ని కూడా పునఃపరిశీలించాలని విన్నవించారు. కాజీపేట ప్రధాన రైలు మార్గాల కూడలిలో ఉండటం, అక్కడ ఇప్పటికే రైల్వే తయారీ యూనిట్, మహబూబాబాద్‌లో మెయింటెనెన్స్ కేంద్రాల అభివృద్ధి జరుగుతున్నందున ఈ ప్రాంతం జాతీయ స్థాయిలో కీలక రైల్వే హబ్‌గా మారుతుందని పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు, సిమెంట్, ఎరువులు, ఆహార ధాన్యాల రవాణా ద్వారా రైల్వేకు ఈ ప్రాంతం నుండి భారీ ఆదాయం లభిస్తుందని, ఇంతటి ప్రాధాన్యత ఉన్న మార్గాలపై ప్రత్యేక పరిపాలనా పర్యవేక్షణ ఉండాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. చివరగా,భారతీయ రైల్వేల సంస్థాగత బలోపేతానికి, తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చడానికి ఈ డివిజన్‌ను తక్షణమే ఆమోదించాలని కేటీఆర్ కేంద్రాన్ని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *