– శరవేగంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు
– వందేభారత్ బోగీలు కూడా ఇక్కడే తయారీ
– పనులు పరిశీలించిన రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్
– రాష్ట్రం భూమి ఇస్తే వరంగల్‌కు విమాన సౌకర్యం
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హనుమకొండ, జులై 19: హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో రూ.750 కోట్లతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. పనుల పరిశీలన నిమిత్తం ఆయన యూనిట్‌ను శనివారం సందర్శించారు. దేశంలోనే ఇది పెద్ద ప్రాజెక్టు అని, దీని వల్ల చాలామందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. వందేభారత్ బోగీలు కూడా ఇక్కడే తయారవుతాయని, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారతీయ రైల్వేలు పురోగమిస్తున్నాయని మంత్రి వెల్లడిరచారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు. అనంతరం అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 2026 నాటికి ఈ కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని, కాజీపేట నుంచి త్వరలోనే 150 లోకోమోటివ్‌లు కూడా ఎగుమతి అవుతాయని చెప్పారు. త్వరలోనే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో మెట్రో కోచ్‌లు కూడా తయారవుతాయన్నారు. వరంగల్ జిల్లా ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 40 ఏళ్లుగా ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్ ఉందని, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కూడా ప్రయత్నాలు జరిగాయని, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత కాజీపేటలో రైల్వే ఇంజన్లు, కోచ్‌లు, వ్యాగన్ల తయారీకి పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకుని మంజూరు చేశారని చెప్పారు. ప్రధాని మోదీ స్వయంగా ఇక్కడికొచ్చి భూమి పూజ చేశారు. ఈ యూనిట్ ద్వారా సుమారు మూడు వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తుందన్నారు. తెలంగాణలో మొత్తం 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతోందని, వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కూడా అందులో భాగమేనని చెప్పారు. వరంగల్‌లో రింగ్ రోడ్‌లో 50 శాతం పనులను కేంద్రం పూర్తిచేసిందని, టెక్స్‌టైల్ ఇండస్ట్రీని మంజూరు చేసిందని, వెయ్యి స్తంభాల గుడిలో మంటపాన్ని పునరుద్ధరించిందని వివరించారు. ముఖ్యంగా వరంగల్‌లో ఎయిర్‌పోర్టు అవసరం ఎంతో ఉందని తాను గత బీఆర్‌ఎస్ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనేకసార్లు లిఖితపూర్వకంగా విన్నవించానుని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెసు ప్రభుత్వం వచ్చాక కూడా ఇదే విషయంపై విన్నవించానని, ఇప్పటికైనా రాష్ట్రం అవసరమైన భూమిని సేకరించి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి అప్పగిస్తే వరంగల్ ప్రజలకు విమాన సౌకర్యం కలుగుతుందని చెప్పారు. ప్రధాని మోదీ తెలంగాణకు ఏం ఇచ్చారు, బిజెపి ఏం తెచ్చింది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారు తమ కళ్లు తెరిచి చూడాలి, చెవులుంటే వినాలి. మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా చూడాలని కోరుతున్నానని కిషన్‌రెడ్డి అన్నారు.





