లిక్కర్‌ ‌కేసు కొట్టేయడంతో స్వామికి మొక్కు

– తిరుమలకు కాలినడకన చేరుకున్న కవిత
– త్వరలోనే రాజకీయ పార్టీ ఏర్పాటు
– తెలంగాణ ఫస్ట్ ‌నినాదంతో ముందుకు వెళతామని ప్రకటన

తిరుపతి, మార్చి 5: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తిరుమలకు కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు తిరుపతి చేరుకున్నారు. తిరుపతిలోని అలిపిరి వద్ద నుంచి కాలినడకన తిరుమల బయల్దేరిన ఆమె ముందుగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లుగా చేయని తప్పుకు తాను మానసిక వేదన అనుభవించానని కవిత తెలిపారు. అయితే దేవుడి దయతో తనపై ఉన్న కేసును కోర్టు పూర్తిగా కొట్టివేసిందని చెప్పారు. ఆ కేసు నుంచి విముక్తి లభిస్తే కాలినడకన తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటానని మొక్కుకున్నానని, ఆ మొక్కును తీర్చుకోవడానికి ఇప్పుడు తిరుమలకు వచ్చానని వెల్లడించారు. అదే సమయంలో తెలంగాణ రాజకీయా గురించి కీలక ప్రకటన చేశారు. మరో రెండు నెలల్లో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ పార్టీని స్థాపించనున్నట్లు చెప్పారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రజలకు సేవ చేసే పార్టీగా దీనిని తీర్చిదిద్దుతామని కవిత తెలిపారు. తెలంగాణ ఫస్ట్ అనే నినాదంతో ప్రజల సమస్యలను మైక్రో లెవెల్‌లో పరిష్కరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను బీఆర్‌ఎస్‌ ‌సరిగా నిర్వహించలేకపోయింద‌ని ఆమె విమర్శించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రజలపై తమకు ఎలాంటి ద్వేషం లేదని, రాజకీయ ఆధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకించామని కవిత స్పష్టం చేశారు. అలాగే హైడ్రా చర్యలపై కూడా విమర్శలు గుప్పించారు. హైడ్రా పేదలను ఇబ్బంది పెట్టి పెద్దల కోసం పనిచేస్తోందని ఆరోపించారు. తాను ఎప్పుడూ పేదల పక్షాన నిలబడి పోరాడతానని కవిత అన్నారు. అలాగే తనకు న్యాయం చేసిన న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *