రాష్ట్ర రాజ‌కీయాల‌ను కుదిపేసిన క‌విత లేఖ‌

– వ్య‌క్త‌మ‌వుతున్న  భిన్నాభిప్రాయాలు
– బీజేపీ, కాంగ్రెస్‌లు ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు
– గంద‌ర‌గోళం సృష్టించిన లేఖాస్త్రం

భారత రాష్ట్ర సమితి సీనియర్‌ ‌నాయకురాలు, ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత తన తండ్రి ( పార్టీ అధినేత కెసిఆర్‌)‌ కు రాసినట్లుగా చెబుతున్న లేఖ బ‌హిర్గ‌త‌మ‌వ‌డం తెలంగాణరాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసినట్లైంది. ఈ లేఖ నిజంగానే కవిత రాసిందేనా లేక దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర దాగి ఉందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. ఒకవేళ కవితనే నిజంగా రాసి ఉంటే ఈ లేఖ బయటికి ఎలా వొచ్చిందన్నది ప్రధాన ప్రశ్న. బిఆర్ఎస్‌ ‌పార్టీ నాయకత్వం విషయంలో కొంతకాలంగా అంతర్యుద్దం సాగుతున్నట్లు వొస్తున్న వార్తలకు ఇది అద్దం పట్టేట్లు ఉండడంతో కవిత తన స్వహస్తాలతో రాసిన లేఖనే అయివుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలోని లోటుపాట్లు, జరిగిన తప్పులు, సరిదిద్దుకోవాల్సిన అంశాలను సవివరంగా రాసినదాన్నిబట్టి, పార్టీ అధినేత కెసిఆర్‌తో ముఖాముఖి మాట్లాడి చెప్పుకోలేని పరిస్థితిలో లేఖ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలుస్తున్నది.

సహజంగా కెసిఆర్‌ ‌పార్టీ నాయకులను ఎవరినీ కలవరని, ఆయనకు ఏదైనా సమాచారం కావాల్సివొస్తే అందుకు సంబంధించిన వారిని మాత్రమే తన ఫామ్‌హౌజ్‌కు పిలిపించుకుని మాట్లాడి పంపిస్తారన్నది ప్రచారంలో ఉన్నది. ఒక వేళ ఎవరికైనా ఆయనను  కలుసుకునే అవకాశం లభించినప్పటికీ తాము ఏం చెప్పాలనుకుని వెళ్తారో అది పూర్తిగా చెప్పకుండానే ఆయన దగ్గర సెలవు తీసుకుంటారన్న టాక్‌ ‌కూడా ఉంది. ఎదుటివారు ఏం చెప్పాలనుకుంటున్నారో ముందుగానే గ్రహించి దానికి ముందే ఆయన వారిని ఇంప్రెస్‌ ‌చేస్తాడంటారు. అలాంటప్పుడు తాము చెప్పదలచుకున్నది ఒక లేఖ ద్వారా కెసిఆర్‌కు అందించడమే ఉత్తమమని పార్టీనాయకుల అభిప్రాయం. తాజాగా సంచలనాత్మకంగా మారిన లేఖ కూడా అలాంటిదే అయిఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

     వరంగల్‌లో ఇటీవల నిర్వహించిన బిఆర్ఎస్‌ ‌పార్టీ రజితోత్సవ సభపట్ల నిజంగానే చాలామంది అసంతృప్తి చెందినట్లు వార్తలు వొచ్చాయి. గతంలో ఏపార్టీ నిర్వహించనంత ఆర్భాటంగా లక్షలాదిమందితో ఏర్పాటు చేసిన సభలో కెసిఆర్‌ ‌స్పీచ్‌ ‌చాలమందికి నిరుత్సాహాన్ని కలిగించింది. 2023 ఎన్నికల్లో బిఆర్ఎస్‌ ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత కెసిఆర్‌ ‌పబ్లిక్‌లోకి వొచ్చింది ఈ మీటింగ్‌లోనే. ఇకటిన్నర సంవత్సరాల మధ్యకాలంలో అధికార కాంగ్రెస్‌ ఒకవైపు, బిజెపి మరోవైపు బిఆర్ఎస్‌పై తీవ్రంగా విరుచుకుపడుతున్నా కెసిఆర్‌ ‌నుండి ఆ మేరకు స్పందన కనిపించలేదు. ఏడాదిన్నర కాలంగా విమర్శలన్నింటికి ఓపికపట్టిన కెసిఆర్‌ ఈ ‌సమావేశంలో వాటికి ధీటైన సమాధానం చెబుతారని రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిని కనబర్చారు. ప్రజలేకాదు, రాజకీయ పార్టీలుకూడా కెసిఆర్‌ ఏదో సంచల‌నాన్ని లేపుతారనుకున్నవారందరికి నిరాశే ఏర్పడింది.

చెణుకులు, చమత్కారాలు, చురకలతో సాగే కెసిఆర్‌ ‌ప్రసంగం, చాలా సాదా సీదాగానే ముగిసింది. ప్రజల్లో కలిగిన ఈ నిరాశ, నిస్రృహతోపాటు,  ఒక‌టి రెండు తన వ్యక్తిగత  అంశాలను ఈ లేఖలో తన తండ్రికి కవిత తెలియజేసింది. అయితే అది పార్టీ అధ్యక్షుడికి ఆ పార్టీ నాయకురాలిగా రాసిన ఉత్తరమైతే కాదు. ఆ సమావేశంలోని లోటుపాట్లను ఒక కూతురుగా తండ్రి దృష్టికి తీసుకొచ్చిన అంశాలు మాత్రమే అయినా ఆ లేఖ ఎలా బహిర్గ‌త‌మైంద‌నేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మిగిలింది. కల్వకుంట్ల కుటుంబంలో కొంతకాలంగా చెలరేగుతున్న అంతర్యుద్దం తారస్థాయికి చేరుకోవడంవల్లే ఈ లేఖ బయటపడి ఉంటుందేమోనన్న అనుమానం ఏర్పడుతున్నది. లేఖరాసినవారు లేదా లేఖను అందుకున్నవారు ఇద్దరిలో ఎవరో ఒకరు దీన్ని బయటపెడితే తప్ప అస‌లు నిజం వెలుగుచూసే అవకాశం ఉండదు. లేఖ రాసిందని చెబుతున్న కవిత అమెరికాలో ఉన్నప్పుడు ఈ లేఖ విడుదలైంది. వాస్తవానికి లేఖ రాసింది ఈ నెల 2వ తేదీన కాని, అది వెలుగు చూసింది మాత్రం ఈ నెల 22న. ఇన్నిరోజులు ఆ లేఖ కెసిఆర్‌ ‌వద్దనే ఉండి ఉండాలి. ఆయన అనుమతిలేకుండా ఆయనకు సంబందించిన లేఖ ఎలా బహిర్గ‌త‌మ‌వుతుంద న్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.

ఇదిలా ఉంటే ఈ లేఖ వెనుక కాంగ్రెస్‌ ‌హస్తం ఉందని బిజెపి, బిజెపితో దోస్తీకి అనుకూలాంశాన్ని అందులో పొందుపర్చారని కాంగ్రెస్‌ ‌పోటాపోటీగా విమర్శించుకుంటున్నాయి. బిజెపికి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్  ఈ ‌లేఖను ఫ్యామిలీ డ్రామా అంటూనే ఇది కాంగ్రెస్‌ ‌వదిలిన బాణంగా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. కుటుంబ రాజకీయాలకు బిజెపి మొదటినుండి వ్యతిరేకమేనంటూ, ఆ పార్టీ తన సొంత  సంక్షోభాన్ని ప్రజల ఎమోషన్‌గా మార్చాలని ప్రయత్నిస్తున్నదన్నారు. కాగా, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా దీనిపై కామెంట్‌చేస్తూ బిఆర్ఎస్‌ ‌పనైపోయిందన్నది ఈ లేఖ ద్వారా స్పష్టమవుతున్నదన్నారు. ఆయన కూడా దీన్ని కుటుంబ డ్రామాగా అభివర్ణిస్తూ, కొన్ని అనుమానాలు లేవనెత్తారు. కెసిఆర్‌కు సలహాలిచ్చే స్థాయిలో కవిత ఉందా, ఏ పార్టీగురించి ఎంతసేపు మాట్లాడాలన్నది కెసిఆర్‌కు కవిత చెప్పగలదా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ లేఖ వెనుక బావ బావమరిది( హరీష్‌రావు, కెటిఆర్‌)‌ల హస్తం ఉందన్న అనుమానాలను కూడా ఆయన వ్యక్తంచేస్తున్నారు. ఏదిఏమైనా ఈ లేఖతో బిఆర్ఎస్‌, ‌బిజెపి బంధం బయటపడిందని, రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆయన్నది స్పష్టమవుతున్నదన్నారు.

పైన జరిగిన పరిణామాలన్నిటికీ వరంగల్‌ ‌రజతోత్సవ సభ వేదికగా మారింది. ఈ సభ నిర్వహణ బాధ్యతల్లో కల్వకుంట్ల కుటుంబంలోని కెటిఆర్‌ ‌మినహా కవితకు, హరీష్‌రావుకు ప్రాధాన్యమివ్వలేదన్న విషయాన్ని ఆనాడు పత్రికల్లో కూడా ప్రధాన చర్చనీయాంశమైంది. దీంతో తమ రాజకీయ వారసుడిగా కెటిఆర్‌ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు అయింది. ఈ విషయమై కల్వకుంట్ల కుటుంబంలో చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. ఉద్యమకాలంలో అన్నతో సమానంగా పోరాటం చేసిన తనకు కూడా సమాన స్థాయి ఉండాలని కవిత అడిగినట్లు అప్పట్లో వార్తలు వొచ్చాయి. అదే విషయాన్ని తన లేఖలో ఫలానా అని ఎవరి పేర్లు ప్రస్తావించకుండా పాతవారికే ప్రాధాన్యమివ్వడం పట్ల తన అయిష్టతను వ్యక్తం చేసింది.

ఆ లేఖలో ఇంకా అనేక అంశాలను ఎత్తిచూపిన కవిత, పార్టీనుండి సరైన స్పందన రాని పక్షంలో సొంత  పార్టీని ఏర్పాటు చేసుకునేందుకు కూడా సిద్దమైనట్లు కొద్దికాలంగా వార్తలు వొస్తున్నాయి. ఇప్పటికే పార్టీ పేరును కూడా ఖరారు చేసుకుందన్న ప్రచారం కూడా జరుగుతున్నది. కొత్తగా ఏర్పాటు చేసుకునే పార్టీ ద్వారా కాంగ్రెస్‌కు దగ్గరవ్వాలనుకుంటున్నదని కొందరు, ఇప్పటికే బిజెపితో టచ్‌లో ఉందని మరికొందరు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో సంచలనాత్మకంగా మారిన ఈ లేఖ విషయంపైన పార్టీ అధినాయకత్వం ఇంతవరకు స్పందించలేదు. కాగా వాస్తవంగా ఈ లేఖ ఎవరు రాసారు, ఎవరిద్వారా మీడియా ముందుకు వొచ్చిందన్నది కూడా తేలాల్సిఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *