పార్టీకి, ఎమ్మెల్పీ పదవికి గుడ్‌బై

– నాన్నా.. మీ చుట్టూ ఏం జరుగుతోందో గమనించండి
– నిజాలు మాట్లాడితే నిందలా?
– పోరాటాలు చేస్తే పార్టీ వ్యతిరేక పనులంటారా?
– విలేకరుల సమావేశంలో కేవిత ఆగ్రహం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 3: తనపై సస్పెన్షన్‌ వేటు వేయడంతో తన నిజాయతీని నిరూపించుకునేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన ఆత్మాభిమానాన్ని కాపాడుకునేందుకు తాను ఈ పదవికి, పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. తన వ్యాఖ్యల వల్ల ఏదో జరిగిపోయినట్లు దుష్టచతుష్టయం ప్రచారం చేస్తున్నదంటూ మండిపడ్డారు. తన విషయంలో రెండు గ్యాంగులు జరగనిది జరిగినట్లు ప్రచారం చేశాయని మండిపడ్డారు. ఆరడుగుల బుల్లెట్‌ తనను గాయపరిచిందన్నారు. సంతోష్‌ రావు చేసిన పనులతో కేసీఆర్‌కు చెడ్డ పేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్‌, సంతోష్‌ ముఠాలు బీజేపీ, కాంగ్రెస్‌లతో కుమ్మక్కయ్యాయన్నారు. హరీష్‌ రావును పక్కన పెట్టుకుని నిజాలు మాట్లాడిన తనను బయటకు పంపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీపై తాను ఉద్యమం చేయడం, సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నాననడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. సామాజిక తెలంగాణపై మాట్లాడితే పార్టీ పెడుతున్నానని దుష్ఫ్రచారం చేశారన్నారు. బంగారు తెలంగాణ అంటే హరీష్‌రావు, సంతోష్‌ రావుల ఇళ్లల్లో బంగారం ఉంటే సరిపోతుందా అని మండిపడ్డారు. పార్టీని హస్తగతం చేసుకోవడానికి కుట్రలు జరుగుతున్నాయని, హరీష్‌ రావు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఒకే విమానంలో ప్రయాణం చేసినప్పటి నుంచి తనపై కుట్రలు ప్రారంభమయ్యాయంటూ మీరిద్దరూ ఒకే విమానంలో కలిసి వచ్చారా లేదా అనేది రేవంత్‌, హరీష్‌ చెప్పాలని నిలదీశారు. దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పిన గొప్ప నాయకుడు, బీసీలకు చేయూతనిస్తానని చెప్పి డబ్బులు ఇచ్చిన ఏకైక వ్యక్తి కెేసీఆర్‌ అని కొనియాడారు.

పోరాటాలు చేయడం పార్టీ ప‌నులా?

మహిళలకు ఇస్తామన్న రూ.2500 హామీపై పోస్టు కార్డు ఉద్యమం చేపట్టానని, పేదవాళ్లకు పింఛన్లు పెంచాలని ఉద్యమం చేశానని కవిత వివరణ ఇచ్చారు. తెలంగాణ తల్లి స్వరూపాన్ని మారిస్తే రౌండ్‌ టేబుల్‌ సమావేశం పెట్టానని, బనకచర్లపైనా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడానని, భద్రాచలం వద్ద ఐదు గ్రామాల ముంపు గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చానని తెలిపారు. తనపై అక్రమ కేసులు పెడితే ఐదున్నర నెలలు తీహార్‌ జైలులో ఉన్నానని, 2024 నవంబర్‌ 23 నుంచి ప్రజాక్షేత్రంలోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేశానని, గురుకులాల్లో అన్యాయాలపై మాట్లాడానని చెప్పారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి తనపై కుట్రలు జరుగుతున్నాయని చెబితే కనీసం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయిన కేటీఆర్‌ కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్‌రావు పాల వ్యాపారంపై ఆరోపణలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. పార్టీలో ఉంటూ డబ్బు సంపాదించాలనుకనే వ్యక్తులు కుటుంబంలోని తమ ముగ్గురం కలిసి ఉండకూడదని కుట్ర పన్నారని ఆరోపించారు. మీ చుట్టూ ఏం జరుగుతోందో గమనించండి.. రేపు రామన్నకూ ఇదే ప్రమాదం పొంచి ఉందని కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. రంగనాయకసాగర్‌ వద్ద ఫామ్‌ హౌస్‌ ఉందని, ప్రభుత్వ భూమి కబ్జా చేశారని అన్నారు.. తరువాత కేసే లేదని అన్నారు. కెేటీిఆర్‌పై ఎన్ని కేసులు పెట్టారు.. ఎన్నిసార్లు విచారణకు పిలిచారో అందరికీ తెలుసు.. కెేసీఆర్‌పై ఒక నిర్ణయం తీసుకున్నాక అమలు చేసిన ఆ మంత్రి ఎవరో తనకు తెలుసు కదా అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ మాట్లాడిన తీరు చూస్తుంటే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కనబడటంలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో తొలి నుంచి హరీష్‌ రావు లేరని, కోటి రూపాయలు తీసుకొని వ్యాపారం కోసం ఎక్కడికో వెళ్లారని వార్తలు కూడా వచ్చాయని, టీఆర్‌ఎస్‌ పెట్టాక పది నెలల తరువాత వచ్చారని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు చెడ్డ పేరు రాగానే వైఎస్‌ఆర్‌ను హరీష్‌ కలిసింది అందరూ చూశారని, ట్రబుల్‌ సృష్ఠించి మళ్లీ పరిష్కరించినట్లు ఆయన ప్రచారం చేసుకుంటున్నారని కవిత దుయ్యబట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *