– బీఆర్‌ఎస్ పార్టీ సంచలన నిర్ణయం
– హరీష్, సంతోష్‌లపై విమర్శలతో పార్టీ సీరియస్
– అధ్యక్షుడి ఆదేశాలతో సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: బీఆర్‌ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు-తెలిపింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్‌కుమార్, టి.రవీందర్‌రావు పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కవిత ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. అధిష్ఠానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ఆ ప్రకటన పేర్కొంది. కొంతకాలంగా పార్టీతో విభేదిస్తున్న కవిత ఎక్కువగా తెలంగాణ జాగృతి తరఫున నిర్వహించే కార్యక్రమాలకే పరిమితమయ్యారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని.. తనపై కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని ఇటీవల ఆరోపించారు. గతంలో పరోక్ష విమర్శలు చేసిన కవిత సోమవారం విూడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ వరకు పరిస్థితి వచ్చాక పార్టీ ఉంటే ఏం? లేకపోతే ఏం? అని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ విధానంతో విభేదించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కవితను పార్టీ సస్పెండ్ చేసింది. గతంలో అమెరికా పర్యటన అనంతరం కేసీఆర్ దేవుడని.. కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని పరోక్ష విమర్శలు చేసిన కవిత ఇప్పుడు నేరుగా హరీశ్‌రావు, సంతోష్‌లపై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు మరక ఎలా అంటిందో గులాబీ శ్రేణులు ఆలోచించాలి? పక్కన ఉన్న వాళ్ల వల్లే ఆయనకు ఈ దుస్థితి వచ్చింది. అందువల్లే తెలంగాణ అంటే గిట్టని, పక్క రాష్ట్రం ఎజెండాను అమలుచేసే సీఎం రేవంత్‌రెడ్డి సైతం కేసీఆర్‌ను విమర్శించే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ క్రమంలో ఆమె వ్యాఖ్యలపై కెసిఆర్ చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమె సొంత కుంపటి పెట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





