వారిద్దరి వల్లే కేసీఆర్‌పై నింద

– తమ తండ్రి పరువు పోతే మాకే బాధ
– హరీష్‌, సంతోషలపై ఎమ్మెల్సీ కవిత హాట్‌ కామెంట్స్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: హరీశ్‌ రావు, మాజీ ఎంపీ సంతోష్‌రావుల వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందని తెలంగాణ జాృగతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్‌రావు, సంతోష్‌లది కీలక పాత్ర అని వెల్లడిరచారు. వీరిద్దరి వెనక సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నారని.. వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగొచ్చిన కవిత సోమవారం సాయంత్రం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమ తండ్రి పరువు పోతే మాకు బాధ.. వాళ్లకు ఏమీ లేదు అని అన్నారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్‌రావుది మేజర్‌ పాత్ర.. అందుకే ఆయనను ఇరిగేషన్‌ మంత్రిగా తొలగించారని చెప్పారు. కేసీఆర్‌ తెలంగాణ ప్రజల కోసం, నీళ్ల కోసం ఆలోచిస్తే వీళ్లు సొంత వనరులు, ఆస్తులు పెంచుకోవడంపై ఆలోచించారని, వీళ్ల వల్ల తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌పై సీబీఐ ఎంక్వైరీ వేెయించే పరిస్థితి దాపురించిందని ఆమె విమర్శించారు. కేసీఆర్‌ను అడ్డుపెట్టుకుని హరీష్‌, సంతోష్‌ భారీగా ఆస్తులు కూడబెట్టారు.. అవినీతి అనకొండల మధ్య కేసీఆర్‌ బలిపశువు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంతోష్‌రావు తనపై అనేక కుట్రలు చేసినా భరించాను.. సోషల్‌ మీడియా ద్వారా వ్యక్తిగతంగా దాడి జరిపినా నేనెప్పుడూ వారిని పేరు పెట్టి అనలేదని అన్నారు. ఈ వయసులో కేసీఆర్‌పై సీబీఐ ఎంక్వైయిరీ ఏంది? ఎందుకోసం ఆ ఖర్మ పట్టింది. ఇలాంటి వాళ్లను చూస్తూ ఎందుకు రక్షణ కల్పించాలి.. బీఆర్‌ఎస్‌ సోదరులకు కోపం రావొచ్చు.. కానీ వాస్తవాలు చేదుగా ఉన్నా అప్పుడప్పుడు మాట్లాడాల్సి వస్తోందని కవిత అన్నారు.

రాజకీయ లబ్ధిపొందాలనుకుంటున్న రేవంత్‌

పక్క రాష్ట్రం అజెండాను అమలు చేస్తున్న వ్యక్తి రేవంత్‌ రెడ్డి.. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కేసీఆర్‌ను అనరాని మాటలు అన్నారు. వింటుంటే గుండె తరుక్కుపోతోంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. ఆయనకు డబ్బుపై ధ్యాస లేదని గతంలో ఇదే రేవంత్‌ రెడ్డి చెప్పారని, అలాంటిది కేసీఆర్‌పై ఇప్పుడెందుకు ఇంతటి అభాండాలు వేస్తున్నారని నిలదీశారు. కాళేశ్వరంలో పనిచేసిన ముగ్గురు ఇంజినీర్ల ఇళ్లపై ఏసీబీ దాడులు చేస్తే ఒక్కొక్కరి వద్ద వందల కోట్ల ఆస్తులు వెలుగు చూశాయి.. వారి వెనుక ఎవరున్నారో విచారణ జరిపే దమ్ము కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎందుకు లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ను మాత్రమే టార్గెట్‌ చేస్తోందన్నారు. కేసీఆర్‌పై అభాండాలు వేసే అవకాశం ఎవరిచ్చారో బీఆర్‌ఎస్‌ శ్రేణులు, తెంలగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కొంతమంది కేసీఆర్‌ పక్కనున్నవాళ్లు కేసీఆర్‌ పేరు చెప్పుకుని అనేక రకాలుగా లబ్ధి పొందిన వారినే ముందుకు తీసుకువెళ్తామంటే పార్టీ ఎలా ముందుకు వెళ్తుందని ప్రశ్నించారు. కేసీఆర్‌ మీద విచారణ వేసినందుకు స్థానిక సంస్థల్లో నష్టం జరిగితే జరగచ్చునన్నారు. కాంగ్రెస్‌కు దమ్ము ధైర్యం ఉంటే తాను పేర్లు చెప్పిన వారి మీద చర్యలు తీసుకోవాలన్నారు. ఒక బిడ్డగా నేను బాధపడుతున్నానన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం  అనునిత్యం కేసీఆర్‌ను విమ‌ర్శించ‌డం తప్పితే ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పడం లేదని కవిత విమర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *