– నిరసన దీక్ష పొడిగింపునకు హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ 72 గంటల దీక్షను ప్రారంభించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ధర్నా చౌక్ వద్ద సోమవారం కవిత ప్రారంభించిన దీక్షకు పోలీసులు 72 గంటలపాటు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వలేదంటూ తెలంగాణ జాగృతి లీగల్ సెల్ అధ్యక్షుడు అప్పల నరేందర్ యాదవ్ అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణకు చేపట్టారు. పోలీసుల వాదనలు వినకుండా ఏవిధమైన ఉత్తర్వులను జారీ చేయబోమని తేల్చి చెప్పారు. నిరాహార దీక్ష 72 గంటలపాటు నిర్వహించేందుకు అనుమతి కోరితే పోలీసులు సాయంత్రం వరకే అనుమతిచ్చారని పిటిషనర్ న్యాయవాది ముక్రమ్ అలీ చెప్పారు. దీక్షను 72 గంటల పాటు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులను ఆదేశించాలని కోరారు. నిరసన శాంతియుతంగా జరుగుతోందని, సోమవారం ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు 200మందితో నిరాహార దీక్షకు సెంట్రల్ జోన్ పోలీస్ కమిషనర్ అనుమతి ఇచ్చారని చెప్పారు. అయితే పిటిషనర్ 72 గంటల అనుమతి కోరారని, దీక్షకు అనుమతిని 72 గంటలకు పొడిగించేలా పోలీసులను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. పోలీసుల వాదన తెలుసుకునే వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయబోమని తేల్చిచెప్పింది. అయితే పిటిషనర్ నిరాహార దీక్ష కంటెంట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్ చేయకుండా నిరోధిస్తూ పోలీసులు విధించిన షరతు రద్దు చేస్తున్నట్లు, పోలీసుల అనుమతి ఉత్తర్వుల్లోని 17వ షరతును సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడిరచింది. పోలీసులకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వొచ్చే వారానికి వాయిదా వేసింది.





