– ఉభయ సభల్లో ప్రసంగించకుండా నిష్క్రమణ
– ఇది రాజ్యాంగ విరుద్ధం
-సీఎం సిద్దరామయ్య ఆక్షేపణ
బెంగళూరు, జనవరి 22: తమిళనాడు, కేరళ మాదిరిగానే కర్ణాటకలోనూ గవర్నర్ వ్యవహారం వివాదాస్పదం అయ్యింది. కొత్త ఏడాదిలో కర్ణాటకలో తొలి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ ప్రతులను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ చదవకుండా పక్కన పెట్టారు. ఈ రాష్ట్రం ప్రగతి మార్గంలో నడుస్తోంది.. సమావేశాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా అంటూ రెండు లైన్లలో తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహారం గవర్నర్ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలకు దారితీసింది. గవర్నర్ తీరుపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్యగా సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. రెండేళ్లుగా గవర్నర్ థావర్‌చంద్ కాంగ్రెస్ సర్కారు తయారు చేసిన సభా ప్రసంగాలను ఉభయ సభల్లో యథావిధిగా చదివారు. అయితే ఈసారి తన ధోరణిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రాన్ని విమర్శించే అంశాలతో తన ప్రసంగాన్ని సిద్ధం చేసిన తీరును ఆయన ముందుగానే ఆక్షేపించారు. దాంతో గురువారం అసలు ఆయన సభకు వస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు సభకు వచ్చిన ఆయన్ను సీఎం ఆహ్వానించారు. దాంతో ఆ ప్రసంగంపై అభిప్రాయభేదాలు పరిష్కారం అయ్యాయనే అభిప్రాయం కలిగింది. కానీ కొద్దిసేపటికే అలాంటిది ఏదీ లేదని అర్థమైంది. ఆయన కేబినెట్ సిద్ధం చేసిన ప్రసంగాన్ని చదవకుండా తాను సిద్ధం చేసుకున్న ప్రసంగాన్ని కేవలం రెండులైన్లు చదివి సభ నుంచి వెళ్లిపోయారు.
ప్రారంభం రోజే హైడ్రామా
కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో ప్రారంభం రోజే హైడ్రామా నడిచింది. ఉపాధి హామీ పథకానికి సవరణలు వద్దనే తీర్మానంపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగాన్ని గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ కేవలం రెండు లైన్లు చదివేసి సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక పురోగతి వేగాన్ని రెట్టింపు చేయడానికి కట్టుబడి ఉంది. జై హింద్, జై కర్ణాటక అంటూ ప్రసంగాన్ని ముగించారు గవర్నర్. దీంతో గవర్నర్ తీరుపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘లోక్ భవన్ బీజేపీ కార్యాలయంగా మారిందా అని గవర్నర్‌ను ప్రశ్నించారు. గవర్నర్ గహ్లోత్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ’ప్రతి కొత్త సంవత్సరం గవర్నర్ అసెంబ్లీ ఉమ్మడి సమావేశంలో ప్రసంగించాలి. ఆ ప్రసంగ పత్రాలను క్యాబినెట్ తయారు చేయాలి. ఇది రాజ్యాంగబద్ధమైన అవసరం. నేడు క్యాబినెట్ తయారు చేసిన ప్రసంగాన్ని చదవడానికి బదులు గవర్నర్ స్వయంగా రూపొందించుకున్న ప్రసంగాన్ని చదివారు. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176, 163ను ఉల్లంఘనల కిందకు వస్తుంది. రాజ్యాంగం ప్రకారం ఆయన తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదు. అందువల్ల గవర్నర్ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలపబోతున్నాం. సుప్రీంకోర్టును ఆశ్రయించాలా.. వద్దా అని పరిశీలిస్తున్నాం అని సిద్ధరామయ్య అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





