కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడిగా ఎనిమిదోసారి పొన్నం రవిచంద్ర ఏకగ్రీవం

వచ్చే ఏడాది స్వర్ణోత్సవాలకు సన్నాహాలు

కరీంనగర్, ప్రజాతంత్ర : కరీంనగర్ ఫిలిం సొసైటీ (Karimnagar Film Society – కఫీసో) 2026 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. నగరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పొన్నం రవిచంద్ర ఎనిమిదవసారి అధ్యక్షుడిగా ఎన్నిక కాగా, కార్యదర్శిగా లక్ష్మీ గౌతమ్ ఎన్నికయ్యారు.

 

నూతన కార్యవర్గం వివరాలు:

  • అధ్యక్షులు: పొన్నం రవిచంద్ర
  • కార్యదర్శి: లక్ష్మీ గౌతమ్
  • కోశాధికారి: చెన్నా అనిల్ కుమార్
  • ఉపాధ్యక్షులు: కోల రామచంద్రారెడ్డి, సయ్యద్ ముజాఫర్
  • జాయింట్ సెక్రటరీ: మాడిశెట్టి గోపాల్, కొమరవెల్లి వెంకటేశం

ఈ సంస్థకు గౌరవ అధ్యక్షురాలిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, గౌరవ సలహాదారులుగా మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జి.వి. శ్యాంప్రసాద్ లాల్, వరాల మహేష్ నియమితులయ్యారు. నారదాసు లక్ష్మణరావు, వరాల మహేష్, పి.ఎస్.రవీంద్రలు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు.

సాంస్కృతిక కేంద్రంగా కఫీసో:

ఎన్నికల అనంతరం జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ.. కవులు, కళాకారులు, రచయితలు, మేధావుల కలయికతో కఫీసో ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందుతోందని అభినందించారు. 48 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ సంస్థ, వచ్చే ఏడాది స్వర్ణోత్సవాలు జరుపుకోబోతుండటం చారిత్రక విశేషమని పేర్కొన్నారు. చిన్న చిత్రాలను ప్రోత్సహించేందుకు ‘చిన్నితర’ వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టడం అభినంద‌నీయ‌మ‌ని కొనియాడారు.

సీనియర్ పాత్రికేయులు పి.ఎస్. రవీంద్ర మాట్లాడుతూ.. 48 ఏళ్ల క్రితం ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ ప్రస్థానం, నేడు రవిచంద్ర నేతృత్వంలో అందరి సమిష్టి కృషితో ఉన్నత స్థాయికి చేరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వరాల మహేశ్, గాజోజు నాగభూషణం, సయ్యద్ ముజఫర్ తదితరులు ప్రసంగించగా, కార్యదర్శి లక్ష్మి గౌతమ్ వందన సమర్పణ చేశారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *