తెలుగు ఆర్ట్ సినిమాల‌కు ఆద్యులు బి.నర్సింగరావు

  • మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు
  • ఘనంగా చిత్రోత్సవం ప్రారంభం
  • తెలంగాణ అణచివేతను కళ్లకు కట్టిన చిత్రం ‘మా భూమి’
  • 80వ వసంతంలోకి అడుగుపెట్టిన నర్సింగరావు.. కేక్ కట్ చేసి వేడుకలు
  • కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ‘దాసి’ సినిమా ప్రదర్శన

కరీంనగర్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 26 : తెలుగు చిత్రసీమలో కళాత్మక చిత్రాలకు ఆద్యుడు బి.నర్సింగరావు అని, ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు కొనియాడారు. బి.నర్సింగరావు 80వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ ఫిలిం సొసైటీ (Karimnagar Film Society) ఆధ్వర్యంలో శుక్ర‌వారం రాత్రి ఏర్పాటు చేసిన ‘బి.నర్సింగరావు చిత్రోత్సవాల’ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ.. గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో నర్సింగరావు నిర్మించిన ‘మా భూమి’ చిత్రం నాటి తెలంగాణ భూస్వామ్య దోపిడీని, సామాన్యులపై జరిగిన అణచివేతను ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. ఆయన దర్శకత్వం వహించిన దాసి, రంగుల కల, మట్టి మనుషులు వంటి చిత్రాలు జాతీయ అవార్డులను కైవసం చేసుకుని తెలుగు సినిమా కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయని గుర్తుచేశారు. ఆయన కేవలం దర్శకుడే కాకుండా జననాట్యమండలి వ్యవస్థాపకుడిగా సాంస్కృతిక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.

కరీంనగర్ ఫిలిం సొసైటీకి పెద్దన్న

ఫిలిం సొసైటీ అధ్యక్షులు పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ.. నర్సింగరావు మొదటి నుంచి కరీంనగర్ ఫిలిం సొసైటీకి అండగా నిలుస్తున్నారని తెలిపారు. గద్దర్ అవార్డుల నిర్వహణలో ఆయన అందించిన సహకారం మరువలేనిదని, అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఆయన జ్యూరీ సభ్యుడిగా వ్యవహరించడం తెలుగువారందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.

వేడుకగా జన్మదినోత్సవం

చిత్రోత్సవంలో భాగంగా నర్సింగరావు 80వ జన్మదిన వేడుకలను సభ్యులందరూ కలిసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన ప్రతిష్టాత్మక చిత్రం ‘దాసి’ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఫిలిం సొసైటీ సలహాదారు వరాల మహేష్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీ గౌతమ్, ఉపాధ్యక్షులు కోల రామచంద్రారెడ్డి, సయ్యద్ ముజఫర్, కోశాధికారి చెన్న అనిల్ కుమార్, సభ్యులు దశరథం, వెంకటేశం, నాగభూషణం, అశోక్ రావు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *