– మంత్రి పొన్నం ప్రభాకర్
-‘శాతవాహన’లో హాస్టల్ భవనాలకు మంత్రులు పొన్నం, అడ్లూరి శంకుస్థాపన
కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: ఆర్థిక ఇబ్బందులున్నా అభివృధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నామని, రాబోయే కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా పనిచేస్తామని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. స్థానిక శాతవాహన యూనివర్సిటీలో నూతన గిరిజన బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణ పనులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ యూనివర్సిటీలో రూ.20 కోట్లతో బాలుర, బాలికల హాస్టల్స్‌కు శంకుస్థాపన చేసుకున్నామని చెప్పారు. తాను మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా ఉన్నప్పుడు పెద్దలు జీవన్‌రెడ్డితో కలిసి 200 ఎకరాల్లో శాతవాహన యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత శాతవాహన వర్సిటీ అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందని భావించామని, కానీ గత పాలకుల నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు తాము ఏర్పాటు చేసిన కాంపౌండ్, మొక్కలు తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు. కొత్తగా ఒక్క విద్యాసంస్థ తేలేదన్నారు. ఇప్పుడు ప్రజా పాలన ప్రభుత్వంలో హుస్నాబాద్‌కు ఇంజనీరింగ్ కాలేజి, కరీంనగర్‌కు లా కాలేజి, ఫార్మసీ కాలేజీలు తెచ్చుకున్నామన్నారు. గత ప్రభుత్వంలో అన్ని జిల్లాల తరువాత కరీంనగర్‌కు ప్రభుత్వ మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు. గతంలోనే కోరుట్లకు వ్యవసాయ కాలేజి తెచ్చుకున్నామని, పెద్దపల్లికి ఇంజనీరింగ్ కాలేజి తెచ్చుకున్నామని చెప్పారు. ప్రభుత్వం తరపున మబౌలిక వసతులు కల్పిస్తామంటూ నాణ్యమైన విద్య అందించాని వీసీకి పొన్నం విజ్ఞప్తి చేశారు. దేశవిదేశాల్లో ఇక్కడికి అడ్మిషన్లు పొందేలా ఎదగాలన్నారు. ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో మొదటి 100 ర్యాంకులు కూడా శాతవాహన యూనివర్సిటీలోనే తీసుకుంటామనే విధంగా పోటీ పడాలన్నారు. కాగా, హాస్టల్స్‌కు రూ.20 కోట్లు మంజూరు చేసినందుకు మంత్రి అడ్లూరికి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, వీసీ ఉమేష్ కుమార్, ‘సుడా’ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, వెలిచాల రాజేందర్ రావు, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





