దక్షిణ భారతంలో తెలుగుప్రజలు మాత్రమే రెండురాష్ట్రాలుగా విడిపోయారు. ఈ క్రమంలో రెండురాష్ట్రాల ప్రజలమధ్య ద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయి, ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో సృజనాత్మకరంగానికి చెందిన కవులు, రచయితలు, కళాకారులు కీలకమైనపాత్ర పోషించటం శోచనీయం. ఈ నేపథ్యంలో ముందుకు వచ్చిన ఛాయ లిటరరీ ఫెస్టివల్ కు ప్రాంతీయత పరమార్థం కాకూడదు. ఆధిపత్యభావనలకు అతీతంగా సాంస్కృతిక వికేంద్రీకరణకు అనుకూలంగా, అన్ని ప్రాంతాలకు చెందిన తెలుగుప్రజల మధ్య స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్రత్వం, సుహృద్భావ వాతావరణం ఏర్పడే అవకాశాలను మెరుగుపరచటమే ఛాయ లిటరరీ ఫెస్టివల్ ప్రధానాంశంగా ఉండాలి.
హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఒకటికిమించి వున్నప్పటికీ సామరస్యంగా జీవిస్తున్నాయనే వాస్తవాన్ని గుర్తించటం అవసరం. దేశ విభజన అనంతరం భారత్ – పాక్ ప్రజల గాయాలను మాన్చటం కోసం ఉభయదేశాల సాంస్కృతిక ప్రముఖులు సాగిస్తున్న కృషి కనువిప్పు కావాలి. దక్కనీ స్వతంత్రభాష. నిజాం రాజ్యానికి చెందిన చదువరుల్లో అత్యధికులు ఆదరించిన భాష. మరాఠీతోసహా, దక్షిణభారతంలోని అన్ని ప్రాంతీయభాషల ప్రమేయం దక్కనీలో ఉంది. అది దహెల్వీకే కాదు, మరి దేనికీ యాసకాదు.

ఖాదర్ మొహియుద్దీన్





