– ప్రొఫెసర్ ఎస్.వి.సత్యనారాయణ
– అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో కాళోజీ స్మారకోపన్యాసం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: పద్మవిభూషణ్, తెలంగాణ వైతాళికుడు ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రధాన భవనంలో కాళోజీ చిత్రపటానికి మంగళవారం పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాళోజీ స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కేంద్ర సాహిత్య అకాడమీ(న్యూదిల్లీ) జనరల్ కౌన్సిల్ సభ్యుడు, సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం(హైదరాబాద్) మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు తెలంగాణ విమోచనోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని జైలు శిక్ష అనుభవించారని పేర్కొన్నారు. ఆచార్యులు సత్యనారాయణ తెలంగాణ విమోచనోద్యమం-కాళోజీ కవిత్వం అనే అంశంపై ప్రసంగించారు. కాళోజీ తన జీవితం మొత్తం సమాజాభివృద్ధికే పాటుపడ్డారని, తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసమే చివరి వరకు పరితపించారని, తన ముక్కుసూటి రచనలతో సమాజాన్ని చైతన్యపరిచారని తెలిపారు. తెలంగాణ భాష, యాసతోపాటు ప్రజలు వాడే మాండలికాలనే ఉపయోగించేవారని ఆయన పేర్కొన్నారు. కాళోజీ నిరాడంబర జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమని పేర్కొన్నారు. సామాన్య ప్రజలను చైతన్యవంతులుగా చేయడం, ప్రజల భాషలోనే సాహిత్య రచనలు చేయడం ఒక్క కాళోజీకే చెల్లిందన్నారు. తెలంగాణలో వొచ్చిన ఎన్నో సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న ఘనత కూడా కాళోజీకే సాధ్యమైందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాళోజీ రచనలకు, భాషకు ప్రాముఖ్యత ఏర్పడిరదన్నారు. తెలంగాణ ప్రజా సమస్యలే తన సమస్యలుగా కవిత్యం రాసేవారని సత్యనారాయణ పేర్కొన్నారు. అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.పుష్పా చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ వైతాళికుల జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు భవిష్యత్ తరాలకు పరిచయం అయ్యేలా, పరిశోధకులకు, చరిత్రకారులకు ఉపయోగపడేలా విశ్వవిద్యాలయంలో స్మారకోపన్యాసాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ వైతాళికుల్లో కాళోజీ ముందు వరసలో నిలుస్తారని, తనజీవిత కాలం తెలంగాణ భాష, యాస, ప్రత్యేక రాష్ట్ర్ర ఆవిర్భావం అనే ధ్యాసనే ఉండేదని ఆమె గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్ ఎన్.రజని, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి, ప్రొఫెసర్లు ఆనంద్ పవార్, వడ్డాణం శ్రీనివాస్, పల్లవీ కాబడే, పలువురు డీన్స్, డైరెక్టర్స్, అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





