(మండువ రవీందర్‌రావు )
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన సమగ్ర నివేదికపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఈ రిపోర్టు ఆధారంగా సోమవారం మంత్రివర్గ బేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాకు వివరించిన అంశాలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీడియా ముందు తెలిపిన అంశాల్లో వాస్తవం లేదని ఆ పార్టీ ఖండించింది. వాస్తవంగా ఇది ఘోష్ కమిటి ఇచ్చిన రిపోర్టులా లేదని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా తయారు చేసిన రిపోర్టుగా ఉందని ఆరోపిస్తున్నది. వాస్తవాలను వక్రికరించి, అబద్దాలను ప్రజల ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారంటూ, కాంగ్రెస్ కుట్రలు- వాస్తవాలు అనే అంశంపై మాజీ మంత్రి హరీష్‌రావు మంగళవారం తెలంగాణ భవన్‌లో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన వాస్తవాలేమిటన్నది చెప్పే ప్రయత్నం చేశారు. జస్టిస్‌పిసీ ఘోష్ కమిషన్ సుదీర్ఘ కాలంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిపిన విచారణకు సంబందించిన 650 పేజీల రిపోర్టును సీల్డ్ కవర్‌లో ప్రభుత్వానికి అందజేసింది. మంత్రివర్గం సమీక్షించడానికి ముందే అది మీడియాకు లీక్ అయింది. ఇంకా ముఖ్యమంత్రి కూడా చూడని రిపోర్టులోని అంశాలు పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగాయి. అందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను టార్గెట్ చేసే అంశాలు ఉండడంతో, టివి డిబేట్‌లలో వాటిపై చర్చలు కూడా ప్రారంభమైనాయి. అయితే కావాలనే పాలకులు, అధికారులు దీన్ని లీక్ చేయించారని బిఆర్‌ఎస్ తీవ్రంగా ఆక్షేపించింది. జస్టిస్ ఘోష్ ఇచ్చిన 650 పేజీల రిపోర్టులోని ప్రధాన అంశాలతోకూడిన 60 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి, దాన్ని సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టింది. కుదించిన ఈ రిపోర్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా కెసిఆర్‌ను లక్ష్యంగా చేసుకుని తయారు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తున్నదని బిఆర్‌ఎస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. నిజంగానే ఘోష్ కమిషన్ రిపోర్టులో ప్రభుత్వం తెలిపిన అంశాలే ఉండి ఉంటే తప్పనిసరిగా కమిషన్ను ప్రభుత్వం తప్పుదోవ పట్టించి అయినా ఉండాలి లేదా కమిషన్ ముందు వాస్తవాలను దాచిపెట్టి అయినా ఉండాలంటూ హరీష్‌రావు ఆరోపించారు. అందుకే కమిషన్ అందించిన 650 పేజీల రిపోర్టునంతా పబ్లిక్ డొమినియన్‌లో పెట్టాలని, ప్రజలుకూడా అందులో ఏముందో చదివి అర్థంచేసుకునే అవకాశముందంటూ డిమాండ్ చేశారు. మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలన్నిటినీ ఆయన తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు లేవని, ప్రాజెక్టును తమ్మడిహట్టి దగ్గర కాకుండా మేడిగడ్డవద్ద నిర్మాణం చేయడంలో నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలను కొట్టివేస్తూ, అందుకు తగిన సాంకేతిక ఆధారాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌లో హరీష్‌రావు చూపించారు. కేంద్రప్రభుత్వానికి సంబందించిన పలు సంస్థలు లిఖిత పూర్వకంగా ఇచ్చిన అనుమతులున్నప్పటికీ, అనుమతులు లేవని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలను తప్పుతోవ పట్టించడమే కాకుండా, ఆ సంస్థలనుకూడా అవమానిస్తున్నారన్న హరీష్‌రావు, అందుకు సంబందించిన లేఖలన్నిటినీ ప్రజలముందుంచారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ విధానం కేంద్ర ప్రభుత్వాన్నే తప్పుపడుతున్నట్లుగా ఉందంటూ ఆయన ఘాటైన విమర్శ చేశారు. రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నట్లు కెసిఆర్ ఏ ఒక్క అంశంలో కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదని, అన్నిటిని నియమ నిబంధనలకు లోబడే అమలుపర్చారని హరీష్‌రావు వివరించారు. ఎక్స్‌పర్ట్ కమిటి సూచనలు కూడా పాటించలేదన్న ఆరోపణపై స్పందిస్తూ, ఎక్స్‌పర్ట్ కమిటి కమీషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లోనే కాంగ్రెస్ ఆరోపిస్తున్న ప్రధాన అంశాలకు సంబందించిన వివారాలున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాగా ఈ విషయంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు దోబూచులాడుతున్నాయని భారతీయ జనతాపార్టీ ఆరోపిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్‌కు ఏటిఎంగా మారిందని, వేల కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుందని ఆరోపిస్తున్న కాంగ్రెస్, సోమవారంనాడు మీడియా ముందు ప్రవేశపెట్టిన రిపోర్టు అంశాల్లో అవినీతి ఎక్కడ, ఏ మేరకు జరిగిందన్న అంశాలను చెప్పలేకపోయిందన్న అంశాన్ని బిజెపి నాయకులు లేవనెత్తుతున్నారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో దీన్ని చర్చకు పెడుతామంటున్నారని, అప్పుడే దీనిపైన తమ పార్టీ అభిప్రాయాన్ని చెబుతామంటోంది బిజెపి. హరీష్‌రావుకూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. కేవలం కెసిఆర్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ కుదించిన రిపోర్టును ప్రజలముందు పెట్టే ప్రయత్నంచేసిందని, శాసనసభలో పూర్తి రిపోర్టు అందినతర్వాత ప్రాజెక్టు నిర్మాణంలో తామెంత పారదర్శకంగా వ్యవహరించిన విషయాలను శాసనసభ్యులు తద్వారా ప్రజలముందు పెడతామంటున్నారు హరీష్‌రావు.
కాళేశ్వరం రిపోర్టుపై వాదప్రతివాదాలు





