– మేడిగడ్డ ప్రాజెక్టు గురించి మాట్లాడటం ఆపండి
– రూ. లక్షల కోట్లు అప్పులు చేసి ఎదురు దాడా?
– పాలమూరు-రంగారెడ్డిని ఎందుకు పండపెట్టారు
– ఈవన్నీ చేసినందుకు సిగ్గుతో తలదించుకోవాలి
– పెద్దపల్లి జిల్లాలో కూలిన చెక్‌డ్యామ్‌ల పరిశీలన
– కేసీఆర్ తీరుపై తీవ్ర పదజాలంతో మంత్రి ఉత్తమ్ విమర్శలు
పెద్దపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రూ.లక్షల కోట్లు అప్పులు చేసిన వారే ఇప్పుడు మళ్లీ రంకెలు వేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిజైన్ చేసి నిర్మించిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలిందని గుర్తు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు గురించి మాట్లాడటం ఆపి సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లాలో మంత్రి ఉత్తమ్ సోమవారం పర్యటించి గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో కూలిపోయిన చెక్ డ్యాంలను పరిశీలించారు. ఈ ఘటనపై అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనులను నాసిరకంగా, నాణ్యత లేమితో నిర్మించినా లేదా ఎవరైనా కావాలనే ధ్వంసం చేసినట్లు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని తమ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు. ఈ విచారణను వేగవంతం చేసి బాధ్యులను గుర్తించాలని ఇప్పటికే విజిలెన్స్ అధికారులను ఆదేశించామన్నారు. రైతన్నలకు మేలు చేసే చెక్ డ్యాంలను ఎవరైనా ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే ఉపేక్షించబోమని మంత్రి హెచ్చరించారు. కాగా, బీఆర్‌ఎస్ హయాంలో ఐదేళ్లలో వాడుకున్న నీరు 70, 80 టీఎంసీలే. రూ.1.80 లక్షల కోట్ల ప్రాజెక్టు నిరుపయోగం కావడం బీఆర్‌ఎస్ ఘనత. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు అనేది పదేళ్లకు అంగీకరించారు. పాలమూరు, ఎస్‌ఎల్‌బీసీని బీఆర్‌ఎస్ పూర్తి చేస్తుంటే ఎవరైనా అడ్డుకున్నారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీల కింద ఏటా రూ.16వేల కోట్లు చెల్లిస్తున్నాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు పూర్తిగా రాలేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రూ.5 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే పాలమూరు ప్రజలకు అన్యాయం చేశారని ఉత్తమ్ విమర్శించారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్ చెప్పేవన్నీ అసత్యాలేనని విమర్శించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టారని.. అయినా 90 శాతం పనులు కూడా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.5 వేల కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టిందని ఆరోపించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్విరాన్‌మెంట్ క్లియరేన్స్ రాలేదని చెప్పారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయకుండా మహబూబ్‌నగర్ ప్రజలను బీఆర్‌ఎస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు.
గోబెల్స్‌రావుగా పేరు మార్చుకోవాలిః హరీష్‌కు చురకలు
కాగా, సచివాలయంలో విలేకరులతో చిట్ చాట్ గా మాట్లాడుతూ హరీష్ రావు తన పేరును గోబెల్స్ రావు అని ర్చుకోవాలని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం లో మూడు బ్యారేజ్ లు కూలిపోతే బీఆర్ ఎస్ నాయకులు సిగ్గుతో తలవంచుకోవాలి. తెలంగాణ ప్రజల తలలను తాకట్టు పెట్టి కాళేశ్వరం కట్టారు. రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరం నుంచి ఐదేళ్లలో 80 -90 టీఎంసీ మాత్రమే నీళ్లను ఉపయోగించారు. హరీష్ రావు అతి తెలివితేటలు చూపడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కృష్ణా జలాల విషయంలో 2014 నుంచి 2020 వరకు అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ ఆంధ్రకు 512 టీఎంసీలు, తెలంగాణ కు 299 టీఎంసీలకు ఒప్పుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలోని పాలమూరు, కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి, ఎస్ఎల్‌బీసీలను కేసీఆర్ ఎందుకు పూర్తి చెయ్యలేదని ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్ రావులు బరితెగించి మాట్లాడుతున్నారన్నారు. గతంలో వాళ్ళు చేసిన45 టీఎంసీ మైనర్ ఇరిగేషన్, గోదావరి డివెర్షన్ సేవింగ్ 45 టీఎంసీలు నిర్ణయం ప్రకారమే లేఖ రాశాము.. లేఖ కొత్తది కాదు అని ఉత్తమ్ తెలిపారు. బీఆర్ ఎస్ ఒప్పందాన్నే తాము లేఖలో ప్రస్తావించామన్నారు. 2020 కేఆర్ఎంబీ సమావేశంలో కేసీఆర్ 34 శాతం నీటికి ఒప్పుకుంటే తాము 71 శాతం కావాలని లేఖ రాశామన్నారు. పాలమూరుకు ఇప్పటికీ పూర్తిగా పర్యావరణ అనుమతులు రాలేదన్నారు. పదేళ్ళపాటు పాలమూరు పూర్తి చేయకుండా అక్కడి ప్రజలను మోసం చేసింది కేసీఆర్. 90 శాతం పనులు పూర్తి అయితే ఒక్క ఎకరాకు నీళ్లు ఎందుకు ఇయ్యలేదని ప్రశ్నించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.