కాళేశ్వ‌రంపై కాంగ్రెస్ త‌ప్పుడు ప్ర‌చారం

– రూ.94ల‌క్ష‌ల కోట్ల ప్రాజెక్టులో రూ.ల‌క్ష‌ కోట్ల న‌ష్టం ఏంటి?
– కాంగ్రెస్ నేత‌లు ముక్కు నేల‌కు రాయాలి
– ప్రాణ‌హిత‌కు, కాళేశ్వ‌రంకు చాలా తేడా వుంది
– మూడు పిల్ల‌ర్ల‌ను బాగుచేస్తామ‌న్న ఎల్‌.అండ్‌.టి.
– అయినా ప‌ట్టించుకోని ముఖ్య‌మంత్రి
– రూ.1.5ల‌క్ష‌ల కోట్ల‌ను వంతుల‌వారీగా దండుకునే కుట్ర‌
– బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌
హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 8: కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా ప్రచారం చేసినందుకు రేవంత్ సహా కాంగ్రెస్ నేతలంతా ముందుగాల ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు డిమాండ్ చేశారు. సోమ‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు.  కాళేశ్వరం ప్రాజెెక్టులో భాగమైన మల్లన్నసాగర్ నుంచి మూసీకి గోదావరి జలాలను తీసుకువచ్చే పథకానికి శంఖుస్థాపన చేసిన సిఎం రేవంత్ రెడ్డికి మల్లన్నసాగర్ కు గోదావరి నీళ్లు ఎక్కడి నుంచే వస్తాయో చెప్పే నీతి, నిజాయితీ, దమ్ము ఉన్నాయా అని ప్రశ్నించారు. కాళేశ్వరం మీద చేప్పిన అబద్దాలను కప్పి పుచ్చుకోవడానికి మల్లన్న సాగర్ దగ్గర కాకుండా గండిపేట దగ్గర ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాడని విమర్శించారు. లక్షకోట్ల అవినీతి, కాళేశ్వరం కూలేశ్వరం అంటూ  ఆరోపణలు చేసిన రేవంత్  ముఖం చెల్లకనే ఈ విధంగా చేశారని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో ఎలాంటి నిల్వ సామ‌ర్థ్యాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్న కేటీఆర్, తాము మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టులో 141 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో 15 రిజర్వాయర్లను నిర్మించామన్నారు. దీంతో సహజంగానే నిర్మాణ వ్యయం పెరిగిందన్నారు. 2006లో అంచనాలు రూపొందించిన ప్రాణహిత చేవెళ్లకు, 2015లో అంచనాలు రూపొందించిన కాళేశ్వరానికి మధ్య తేడా వుంటుంద‌న్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్ కు గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు తమ హయాంలో రూ.1100 కోట్లతో రూపొందించిన అంచనాలను రూ.7390 కోట్లకు అంటే ఏడు రెట్లు పెంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న‌దని ఆరోపించారు. ఇంతేకాదు రూ.16 వేల కోట్లతో పూర్తయ్యే మూసి సుందరీకరణ ప్రాజెక్టును కూడా రూ.1,50,000 కోట్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచితే హైదరాబాద్ ప్రజలతో కలిసి దాన్ని బీఆర్ఎస్ అడ్డుకుంద‌ని గుర్తుచేశారు. దీంతో రూటు మార్చిన రేవంత్ రెడ్డి విడతల వారీగా జనాల సొమ్మును దోచుకునేందుకే ఈ పథకాలను మొదలుపెట్టారని ఆరోపించారు. మొన్న 12 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకుని చెక్కు చెదరకుండా ఉన్న మేడిగడ్డ బరాజ్ లోని మూడు పిల్లర్లకు ఇప్పటివరకు మ‌ర‌మ్మ‌తులు ఎందుకు చేయించడం లేదో కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు.  రూ.4000 కోట్లతో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో భూసేకరణ ,రిటైనింగ్ వాల్ నిర్మాణం కు అయిన వ్యయాన్ని తీసేస్తే 85 పిల్లర్లు ఉన్న బ్యారేజీ సిమెంట్ స్ట్రక్చర్ నిర్మాణానికే సుమారు రూ.2000 కోట్లు ఖర్చు అయ్యాయి. కుంగిన మూడు పిల్లర్లు వున్న‌ ఏడవ బ్లాక్ ను మాత్రం పునర్నిర్మానం చేస్తే సరిపోతుందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో కూడా స్పష్టంగా ఉంది. ఆ ఒక్క ఏడవ బ్లాకు నిర్మాణానికి రూ.250 నుంచి రూ.300 కోట్ల ఖర్చయింది. ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకోకుండా తామే సొంతంగా ఆ బ్లాకును పునర్నిర్మిస్తామని ఎల్ అండ్ టీ కంపెనీ చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇందులో ప్రజాధనం ఎక్కడ వృథా అయ్యింది? బనకచర్ల ప్రాజెక్టు కోసమే మేడిగడ్డ బరాజ్ ను రిపేర్ చేయించకుండా నీళ్లను కిందికి వృథాగా వదులుతున్నారన్నారు. 94,000 కోట్ల ప్రాజెక్టులో 250 కోట్లు నష్టం జరిగితే, ఆ డబ్బుల్ని కూడా తామే సొంతంగా పెట్టుకుంటామని ఏజెన్సీ ముందుకు వస్తే పట్టించుకోకుండా లక్ష కోట్ల కుంభకోణం అని అబద్ధాలు ప్రచారం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. 2023 మే 17న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్  కేవలం రూ.1100 కోట్ల ఖర్చుతో గోదావరి జలాలను హైదరాబాద్ కు తీసుకొచ్చే పథకానికి రూపకల్పన చేశారు. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ సాగర్ ఉంటే, 560 మీటర్ల ఎత్తులో మల్లన్న సాగర్ ఉంటుంది. 540 మీటర్లు ఎత్తులో గండిపేట చెరువు ఉంటుంది. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్ కు గోదావరి జలాలను గ్రావిటీ ద్వారానే తేవచ్చు. అయితే గోదావరి, మూసీ అనుసంధానికి కొండపోచమ్మ సాగర్ సోర్స్ ని ఎందుకు తీసేసారో తెలియదు. లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక రూ.1100 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును ఇవాళ రూ.7390 కోట్లకు పెంచారు అంటే దాదాపు 7 రెట్లు పెంచారు. ఎవరి కోసం ? ఎందుకోసం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి రావల్ కోల్ చెరువును నింపి అక్కడి నుంచి గండిపేటకు గ్రావిటీ ద్వారా తీసుకురావొచ్చు. కాని రేవంత్ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టు పేరు చెప్పి మూడు నీటి శుద్ది కేంద్రాలు, ఐదు పంప్ హౌస్ లను కడుతుంది. ఎవరి లాభం కోసం కడుతున్నారు? కమిషన్లు దండుకోవడానికా? కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికా? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల‌న్నారు.
———————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *