– ఆయన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హీట్
– ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసుల నేపథ్యంలో కొత్త చర్చ
వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నోటీసులు జారీ చేస్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడిన మాటలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలోని వేలేరు మండలం షోడశపల్లి, మల్లికుదుర్ల, ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలలో నిర్వహించిన పనుల జాతర కార్యక్రమాల్లో కడియం పాల్గొన్నారు. పెద్ద పెండ్యాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ‘గత ఎన్నికల్లో తనను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని మీకు హామీ ఇచ్చాను.. నా మాటలు నమ్మి వోట్లు వేశారు.. కానీ నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు.. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాను.. రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ సహకారం, ప్రభుత్వ అండ ఉంటేనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని ఆలోచించాను. నేను కాంగ్రెస్ పార్టీలోకి వొచ్చి సంవత్సరం అయింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నాను’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ పెద్ద యుద్ధమే చేస్తోంది. వీరి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ కోర్టుకెళ్లింది. సుప్రీంకోర్టు సైతం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని స్పీకర్‌ను ప్రశ్నించింది. మూడు నెలల్లోగా వారిపై తీసుకుంటున్న చర్యలపై స్పష్టత ఇవ్వాలని కోరింది. అయితే ఇదే సమయంలో స్పీకర్ కూడా పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తూ న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని ఈ ఉపద్రవం నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఇలా మాట్లాడారా.. లేక తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని పరోక్షంగా స్పీకర్‌కు చెప్పే యత్నం చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కడియం ఏ ఉద్దేశంతో ఇలా మాట్లాడారోనంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ మారిన కొందరు ఎమ్మెల్యేలు తాము సాంకేతికంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నామని స్పీకర్‌కు చెప్పే యత్నం చేస్తుంటే కడియం మాత్రం తాను అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లో చేరానని ఎందుకు చెప్పారు.. గతంలో చాలామంది ఎమ్మెల్యేలు అభివృద్ధిని సాకుగా చూపి పార్టీ మారారు కాబట్టి అదే కోవలో అధికార పార్టీలోకి వెళ్లక తప్పలేదని చెప్పే యత్నం చేస్తున్నారా.. గతంలో బీఆర్‌ఎస్ తీరును గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారా.. గతంలో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్న బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు ఇబ్బంది ఎందుకొచ్చిందనే విషయాన్ని ప్రస్తావించేందుకే ఆయన పార్టీ మారిన అంశాన్ని చర్చలోకి తీసుకొచ్చారా? దీని వెనుక ఉన్న వ్యూహమేంటనే దానిపై చర్చ నడుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.



