కబడ్డీ పోటీలను జాతరలా నిర్వహించాలి

– క్రీడల శాఖ మంత్రి వాకిటి
– పోటీల ఏర్పాట్లపై అధికారులతో టెలికాన్ఫరెన్స్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: నారాయ‌ణ‌పేట్ జిల్లా మక్తల్‌లో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను రాష్ట్రం గర్వపడేలా, జాతరలా నిర్వహించాలని పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. 33 జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోటీల నిర్వహణపై ప్రజాప్రతినిధులు, జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి శ్రీహరి బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం కప్-2026లో భాగంగా మక్తల్ పట్టణంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నామని, వీటిని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకోవాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. కబడ్డీ పోటీలు ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచేలా నిర్వహణ ఉండాలని, అందుకోసం అతిథ్యం, స్టేడియం, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులను కబడ్డీ పోటీల్లో భాగస్వాములను చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ పోటీలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అతిథులుగా హాజరవుతున్నారని, వారందరినీ గౌరవించుకోవాలని సూచించారు. టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా క్రీడల అధికారి, విద్యుత్, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ చైర్మన్ వాకిటి మానస హన్మంతు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *