– తాల్ హాస్పిటల్స్ హెల్త్‌ఫెస్ట్ 2025కు ఆహ్వానం
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్23:తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘తాల్ హాస్పిటల్స్ హెల్త్‌ఫెస్ట్ 2025’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానాన్ని తాల్ హాస్పిటల్స్ సీఈఓ శ్రీ సాయి గుండవెల్లి హైదరాబాద్‌లో కేటీఆర్‌కు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ కూడా గుండవెల్లి వెంట ఉన్నారు. అక్టోబర్ 24న కాలిఫోర్నియాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో లో ఈ ‘హెల్త్‌ఫెస్ట్ 2025’ నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు, విధాన నిర్ణేతలు, ఆవిష్కర్తలు, మార్పు తీసుకొచ్చేవారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భవిష్యత్ ఆరోగ్య సంరక్షణపై చర్చించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వ్యక్తిగత వైద్యం, డిజిటల్ హెల్త్‌కేర్ ఆవిష్కరణలు, సకృత వైద్య సంరక్షణ, ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలకు మార్గాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో కేటీఆర్ కీలకోపన్యాసం ఇవ్వనున్నారు. తెలంగాణలో టెక్నాలజీ ఆధారిత పాలన, ఆవిష్కరణలతో కూడిన అభివృద్ధి, ఆరోగ్య రంగంలో తీసుకువచ్చిన విధానాలు ప్రపంచ ప్రజలకు ఎంతో విలువైనవిగా ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఆహ్వానాన్ని కేటీఆర్ అంగీకరించినందుకు టచ్‌ఎలైఫ్ ఫౌండేషన్ ధన్యవాదాలు తెలిపింది. హెల్త్‌ఫెస్ట్ 2025లో ఆయన భాగస్వామ్యం ఈ వేదికపై అర్థవంతమైన చర్చలకు దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





