చేనేత సంఘాల సమస్యలను పరిష్కరించాలి

– కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డికి చేనేత సంఘాల వినతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: చేనేత సంఘాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తనను కలిసిన చేనేత సంఘాల నేతలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి హామీ ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన చేనేత సంఘాల నేతలు శుక్రవారం ఆయనను హైదరాబాద్‌లో కలిసి పలు సమస్యలను విన్నవించారు. ముఖ్యంగా ప్రతి చేనేత మగ్గానికి ఉన్న జియో ట్యాగ్‌ అనుబంధ కార్మికులు మొత్తం ముగ్గురు ఉండేలా చూడాలని (గతంలో జియోట్యాగ్‌ అనుబంధ కార్మికులు ముగ్గురు ఉండగా ప్రస్తుతం ఇద్దరికి కుదించారు), 350 సంఘాలకు సంబంధించిన రూ.50 కోట్ల రుణాలను మాఫీ చేసి కొత్తగా రుణాలను మంజూరు చేయాలని, చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. తన రాజకీయ ప్రస్థానమే చేనేత సంఘాల సమస్యల పరిష్కారంతో మొదలైందని గుర్తు చేస్తూ జియో టాగ్‌ అనుబంధ కార్మికుల పెంపు, రుణమాఫీ, కొత్త రుణాల మంజూరు, చేనేత సంఘాలకు ఎన్నికల అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని రాజగోపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు. రాజగోపాలరెడ్డిని కలిసిన వారిలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సిరిపురం, చౌటుప్పల్‌, మోత్కూరు, మునుగోడు, పలివెల, పుట్టపాక సొసైటీ సభ్యులతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన సొసైటీ సభ్యులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *