సుప్రీం కోర్టుకు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ

విచారణ కమిటీ నివేదిక రద్దుకు విజ్ఞప్తి

దిల్లీ, జులై 18: తన అధికారిక నివాసంలో నోట్ల కట్టలు లభించిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో ఎంక్వైరీ కమిటీ నివేదికను పక్కన పెట్టాలని అభ్యర్థించారు.
దిల్లీ: తన అధికార నివాసంలో నోట్ల కట్టలు లభించిన వ్యవహారంలో న్యాయమూర్తుల విచారణ కమిటీ సమర్పించిన నివేదికను సవాలు చేస్తూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ఎంక్వైరీ కమిటీ నివేదికను కొట్టివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఆ కమిటీ నివేదిక తన హక్కులను ఉల్లంఘించిందని, దాని ఆధారంగా తనపై అభిశంసన ప్రక్రియ ప్రారంభించాలన్న మాజీ చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సూచనను పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఉదంతంలో కీలక వాస్తవాలను పరిశీలించకుండానే విచారణ కమిటీ తుది నిర్ణయానికి వచ్చిందని, బర్డెన్‌ ఆఫ్‌ ప్రూఫ్‌ను తనపై మోపడం తప్పని పేర్కొన్నారు. ఎంక్వెరీ కమిటీ అభిప్రాయాలను తప్పని నిరూపించాల్సిన బాధ్యతను తప్పుగా తనపై మోపారని తెలిపారు.
త్వరలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారంలో పోలీసు, ఈడీ విచారణలను కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కూడా ఇటీవల సుప్రీం కోర్టు స్వీకరించింది. ఈ నేపథ్యంలో జస్టిస్‌ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *