– అభిశంవసన తీర్మానం స్వీకరించిన స్పీకర్
న్యూదిల్లీ, ఆగస్టు 12: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) ఇంట్లో నోట్ల కట్టలు లభించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆయన అభిశంసన*impeachment) కోసం లోక్‌సభ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా స్వీకరించారు. ఈ ఉదంతంపై విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీ (three men committee) ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్యానెల్‌లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు జస్టిస్ ఎమ్‌ఎమ్ శ్రీవాత్సవ, సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్యులు సభ్యులుగా ఉన్నారు. అభిశంసన తీర్మానంపై ప్రతిపక్ష, పాలక పక్షానికి చెందిన 146 మంది సంతకాలు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ బిర్లా మాట్లాడుతూ అభిశంసన పక్రియ ప్రారంభం కావాల్సిందేనన్నారు. అవినీతికి పార్లమెంటు పూర్తిగా వ్యతిరేకమని, ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని అన్నారు. ఇక స్పీకర్ ఏర్పాటు చేసిన కమిటీ ఈ ఉదంతానికి సంబంధించిన సాక్షులను ప్రశ్నించి ఆధారాలను పరిశీలిస్తుంది. విచారణ అనంతరం తుది నివేదికను స్పీకర్‌కు సమర్పిస్తుంది. అనంతరం నివేదికను సభ ముందుంచుతారు. న్యాయమూర్తి దోషిగా తేలిన పక్షంలో ఆయన అభిశంసన తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. రాజ్యసభలో కూడా ఇదే పక్రియను అమలు చేస్తారు. ఉభయ సభలు ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి ఆవరణలో కాలిపోయిన నోట్ల కట్టలు దొనకగా ఈ ఘటనపై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీని వేశారు. నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని ఆ కమిటీ తేల్చింది. ఆ నివేదికను జస్టిస్ వర్మ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా అక్కడ ఆయనకు చుక్కెదురైంది.




