– ఆందోళనలో ఆయకట్టు రైతాంగం
– కర్నాటకతో మాట్లాడనున్న మంత్రి ఉత్తమ్
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ప్రాణాధారమైన జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో పాలమూరు రైతాంగం ఆందోళన చెందుతోంది. దీంతో సాగునీటితో పాటు, తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. ఎండలు ముదురుతున్న కొద్దీ ప్రాజెక్టులో నీటి మట్టం అట్టడుగుకు పడిపోవడంతో కోయిల్ సాగర్ లిప్ట్ మోటార్లకు నీరు అందడం లేదు. దీని ప్రభావం కోయిల్ సాగర్ చివరి ఆయకట్టుపై తీవ్రంగా పడుతోంది, సాగునీరు అందక చేతికి వచ్చిన పంటలు ఎండిపోయే స్థితికి చేరుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కోయిల్ సాగర్ ఆయకట్టును ఆదుకోవడానికి తక్షణమే నీటిని విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని, సంబంధిత మంత్రిని కోరారు. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు నీటిని విడుదల చేయించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో ఫోన్ లో మాట్లాడి, జూరాలకు కనీసం 5 టీఎంసీల నీటిని తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కేవలం ఫోన్ సంప్రదింపులకే పరిమితం కాకుండా, ఈ సమస్య పరిష్కారం కోసం పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల బృందం మరో వారం రోజుల్లో బెంగళూరు వెళ్లి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను నేరుగా కలవాలని నిర్ణయించుకుంది. కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నీటిని విడుదల చేస్తేనే ఎండిపోతున్న పంటలకు ప్రాణం పోసే అవకాశం ఉంటుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.