– రైతులు డి.డి. కడితే సరిపోతుంది
– మంత్రి జూపల్లి కృష్ణారావు
వనపర్తి ప్రజాతంత్ర ఆగస్టు 29: డీడీలు కట్టిన తర్వాత 60 రోజుల్లో వ్యవసాయ బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపై ఉందాని ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతులు తమ బోరు బావులకు విద్యుత్ కనెక్షన్ తీసుకోడానికి విద్యుత్ శాఖకు నిబంధనల ప్రకారం డి.డి కట్టి దరఖాస్తు చేసుకుంటే చాలని, విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని అన్నారు. వనపర్తి జిల్లా పానగల్, చిన్నంబావి మండలాల్లో శుక్రవారం మంత్రి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. పానగల్ మండలం దావాజిపల్లి గ్రామంలో రూ. 96.83 లక్షలతో నిర్మించనున్న 33/11 కే.వి విద్యుత్ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో బుచ్చమ్మ అనే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు ఇంటికి భూమి పూజ చేశారు. చిన్నంబావి మండలంలో అయ్యవారిపల్లి గ్రామ పరిధిలో 33/11 కెవి సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. చిన్నంబావి మండలం పెద్ద దగడలో తిరుమలనాథ స్వామి దేవాలయ ప్రాంగణంలో రూ.కోటి వ్యయంతో దేవాలయ నిర్మాణం, పర్యాటక శాఖ నిధులు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మల్టీ లెవల్ కల్చరల్ ఆడిటోరియం పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇంటికి, అయ్యవారిపల్లిలో అంగన్‌వాడి కేంద్రానికి భూమి పూజ చేశారు. అనంతరం చిన్నంబావి మండల కేంద్రంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 23 మంది మహిళా లబ్ధిదారులకు ఉచిత కుట్టు మిషన్లు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు సి.ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ బోరు బావికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి విద్యుత్ శాఖ ద్వారా ట్రాన్స్‌ఫార్మర్, సరిపడ విద్యుత్ స్తంభాలు, కాసారాలు, ఇతర సామగ్రిని కాంట్రాక్టర్లకు ఇచ్చి పని చేసినందుకు డబ్బులు కూడా మంజూరు చేస్తున్నామని, క్షేత్రస్థాయిలో చూస్తే రైతు స్తంభాలు, వైర్లు, ఇతర పనిముట్లు కొని స్తంభాలు సైతం మోస్తుండడంపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తున్న 33/11 కెవి సబ్ స్టేషన్‌లను సకాలంలో పూర్తి చేసి రైతులకు ట్రాన్స్ఫార్మర్లు బిగించి విద్యుత్ కనెక్షన్‌లు ఇవ్వాలని విద్యుత్ శాఖ ఎస్.ఈను ఆదేశించారు. ఇల్లు కట్టుకోలేని నిరుపేదలు ఉంటే మహిళా సంఘాల నుండి బ్యాంకు రుణం ఇప్పించి బిల్లు పాస్ అయ్యాక తిరిగి కట్టించే విధంగా చూస్తామని తెలిపారు. దావాజిపల్లి నుండి పుల్గర్ చర్ల వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.37 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. వర్షాలకు కాలువలు, కుంటలు తెగినట్లయితే మరమ్మతు కోసం నివేదిక ఇవ్వాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించి జిల్లాలో ఎక్కడెక్కడ కుంటలు, కాలువలు తెగిపోయాయో నివేదిక తెప్పించుకోవాలని, ఇరిగేషన్ అధికారులతో సైతం నివేదిక తెప్పించుకొని రెండిరటినీ క్రోడీకరించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. చిన్నంబావి మండల కేంద్రంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు లేకుండా బోరు బావుల విద్యుత్ కనెక్షన్‌లు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కల్చరల్ భవన నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, విద్యుత్ శాఖ ఎస్.ఈ రాజశేఖరం, డి.ఈ శ్రీనివాసులు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అఫ్జల్, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, తహసిల్దార్లు సత్యనారాయణ రెడ్డి, ఎంపీడీఓ గోవింద రాజు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పుట్టిన వూరి రుణం తీర్చుకుంటా
తాను పుట్టి పెరిగిన ఊరికి మంచి వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో పెద్దదగడ గ్రామ పంచాయతీలోని పురాతన శ్రీ తిరుమల నాథ స్వామి దేవాలయ నిర్మాణానికి రూ.కోటి, మల్టీ లెవల్ కల్చరల్ ఆడిటోరియం నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి జూపల్లి చెప్పారు.శుక్రవారం మంత్రి వనపర్తి జిల్లా పానగల్, చిన్నంబావి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వగ్రామం అయిన పెద్ద దగడలో రాజుల కాలం నాటి శ్రీ తిరుమల నాథ స్వామి దేవాలయ అభివృద్ధికి రూ.4 వకోట్లు మంజూరు చేసిన ఉత్తర్వు కాపీలను దేవాలయ కమిటీకి అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



