నిథమ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దాలి

-పర్యాటక-అతిథ్య రంగంలో కొత్త ధోరణులపై దృష్టి పెట్టాలి
-అంతర్జాతీయ విద్యార్థులు, పర్యాటకుల్ని ఆకర్షించాలి
– జాతీయ క్రీడా వారోత్సవాల్లో మంత్రి జూపల్లి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: పర్యాటక-అతిథ్య రంగంలో కొత్త ధోరణులపై దృష్టి పెట్టాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌(నిథమ్‌)లో జాతీయ క్రీడా వారోత్సవాలను ఆయన గురువారం ప్రారంభించారు. ఈనెల 28 నుండి 31 వరకు జరుగుతున్న కార్యక్రమాల్లో ఆరోగ్యం, శ్రేయస్సు, సంస్థాభివృద్ధి అంశాలపై వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని సమూహ యోగాసనాలు, ధ్యానం చేశారు. నిథమ్‌ యోగా శిక్షకురాలు స్మృతి పాండే ఈ శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి జూపల్లి నిథమ్‌ విద్యార్థులు, అధ్యాపకులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. నిథమ్‌ను అగ్రగామి సంస్థగా నిలిపేందుకు విద్యార్థులు, అధ్యాపకులు కృషి చేయాలన్నారు. అంతర్జాతీయ విద్యార్థులు, పర్యాటకులను ఆకర్షించేలా నిథమ్‌ను తీర్చిదిద్దాలన్నారు. కొత్త విద్యా కార్యక్రమాలు, స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రవేశపెట్టాలని, విద్య-శిక్షణ పరిధిని విస్తరించాలని, ఉద్యోగ, పారిశ్రామికావకాశాలను పెంపొందించాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం తరపున నిథమ్‌కు సంపూర్ణ సహకారమందిస్తామని, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్‌ సీఎస్‌తో చర్చించి నిథమ్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని డైరెక్టర్‌కు సూచించారు. నిథమ్‌ను జాతీయస్థాయి ప్రీమియర్‌ ట్రైనింగ్‌, రీసెర్చ్‌, కన్సల్టెన్సీ సంస్థగా తీర్చిదిద్దడంలో డైరెక్టర్‌, అధ్యాపకుల, సిబ్బంది, విద్యార్థుల కృషిని మంత్రి అభినందిం చారు. తమ ప్రభుత్వం పర్యాటక, ఆతిధ్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రముఖ పర్యాటక కేంద్రాలలో మౌలిక సదుపా యాలను కల్పించాలని నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలోని చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యం కలిగిన పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి వాటికి ప్రపంచస్థాయిలో బ్రాండింగ్‌, ప్రచారం కల్పించేందుకు కృషిచేస్తున్నదన్నారు. పర్యాటక కేంద్రాలకు కనెక్టివిటీ పెంచి వసతి, సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పర్యాటక, ఆతిథ్య రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని, ప్రైవేట్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో నిథమ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వెంకటరమణ, శ్రీకర హాస్పిటల్స్‌ సీనియర్‌ డాక్టరు. పి.ఎల్‌.ఎన్‌.పటేల్‌, తదితరులు పాల్గొన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *