ప్రొఫెసర్ రమా సరళాదేవి
కాళోజి జంక్షన్ /హన్మకొండ, ప్రజాతంత్ర ఆగస్టు 19 : జంక్ ఫుడ్ తినడం వల్లనే మహిళలకు గర్భాశయ క్యాన్సర్ (Ovarian Cancer) వొచ్చే ప్రమాదముందని ములుగు ప్రభుత్వ మెడికల్ కళాశాల గర్భాశయ విభాగం ప్రధాన అధిపతి ప్రొఫెసర్ రమా సరళాదేవి అన్నారు. మంగళవారం కేయూ క్యాంపస్ లోని ఫార్మసీ కళాశాలలో తెలంగాణ అకాడమీ సైన్స్ కాంగ్రెస్, కేయూ సంయుక్తంగా నిర్వహించిన సెమినార్‌కు చైర్మన్ గా ఆచార్య మండ సారంగపాణి, ఆచార్య సరూప వ్యవహరించారు. ప్రముఖ వైద్య నిపుణురాలు ఆచార్య రమా సరళ దేవి పిసిఓడి, గర్భాశయ క్యాన్సర్ గురించి వివరించారు. జంక్ ఫుడ్ తో ఆండ్రోజన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వలన క్యాన్సర్ వస్తుందన్నారు. గర్భాశయ క్యాన్సర్ కు ముఖ్యంగా 17 సంవత్సరాల లోపు పిల్లలకు, వివాహితలకు హ్యూమన్ పాపిలో వైరస్ ఎక్కువగా సోకే ప్రమాదముందని హెచ్చరించారు. విద్యార్థులు హెచ్ పి వైరస్ వ్యాక్సిన్ తీసుకుంటే నివారించవచ్చని పేర్కొన్నారు. గార్డసిల్ 4, 9 అనే వ్యాక్సిన్ తీసుకుంటే హెచ్ పి వైరస్ ను రాకుండా జరుగుతుందన్నారు. మగపిల్లల్లో టొబాకో, స్మోకింగ్ టొబాకోతో హెచ్ పి వైరస్ కు సోకే చాన్స్ ఉందని హెచ్చరించారు. మగపిల్లల్లో ఓరల్, ఆనల్ క్యాన్సర్ వొచ్చే ప్రమాదం ఉందని తెలిపారు.
డాక్టర్ నాగారపు లింగయ్య ఐఐసిటి సీనియర్ సైంటిస్టు మాట్లాడుతూ ఇండియన్ ఫార్మ విజన్, ప్రభావం గురించి 2022 -2047 వాటి ప్రాముఖ్యతను వివరించారు. స్వాతంత్రం తర్వాత మన భారతదేశం చాలా డ్రగ్స్ కనుగొన్నదన్నారు. అదే విధంగా గోమాత మూత్రం ద్వారా క్యాన్సర్ వ్యాధులను కూడా నివారించవచ్చని తెలిపారు. ఇండియాలో క్యాన్సర్, టీ.బీ కొత్త మందులు తక్కువ ధరలో లభ్యమయ్యే తయారీ పద్ధతులను అన్వేషించాలని తెలిపారు. సెక్రటరీస్ సీనియర్ ప్రొఫెసర్ వై నరసింహారెడ్డి, ఆచార్య సమ్మయ్య డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ ఆచార్య జనపరెడ్డి కృష్ణవేణి, వివిధ కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు పాల్గొన్నారు.





