– ముందుగానే పట్టుకొని కాల్చిచంపుతున్నారు
– నిర్బంధంలో వున్నవారిని కోర్టుకు హాజరుపరచాలి
– పోలీసులు చంపిన వారిలో ఆదివాసీలే అధికం
– వామపక్షాల ప్రకటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని వామపక్షాలు ఒక ప్రకటనలో డిమాండ్ చేశాయి. ఈ ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో సహా 13మంది మరణించారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టులను ముందుగానే నిర్బంధించి తర్వాత కాల్చి చంపారన్న అనుమానాలున్నాయని వామపక్షాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం వివిధ ప్రదేశాల్లో నిర్బంధంలో వున్న మావోయిస్టులను న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశాయి. ఇప్పటివరకు అడవుల్లో దొరికిన వారిని అక్కడే కాల్చి చంపారు. బయటకు వచ్చి పట్టణ, నగర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నవారిని అడవుల్లోకి పట్టుకెళ్లి కాల్చి చంపుతున్నారని ఆ ప్రకటనలో ఆరోపించాయి. ఏడాది కాలంగా మోదీ, షా ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ కారణంగా అడవులు రక్తసిక్తమవుతున్నాయ ని పేర్కొన్నాయి. విశాలమైన అడవులను ఆదానీ వంటి కార్పొరేట్లకు అప్పగించడానికే, అడ్డుకున్న ఆదివాసీలను హతమారుస్తున్నారని ఆరోపించాయి. అటవీ సంపదతో సహా కోట్లాది ఎకరాల అటవీ సంపదను కార్పొరేట్లకు కారుచౌకగా అప్పగించే పన్నాగంతో ఆపరేషన్ కగార్ కొనసాగుతున్నదని ఆ ప్రకటనలో విమర్శించారు. ఏడాది కాలంలో ప్రభుత్వం కాల్చి చంపిన ఏడెనిమిదివందల మందిలో అధికశాతం ఆదివాసీలేనని పేర్కొంది. ఈనెల 18, 19 తేదీల్లో విజయవాడ, ఏలూరు వంటి నగరాల్లో తలదాచుకున్న వారిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారని, వారిని కోర్టుకు అప్పగించాలని కోరారు. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఉరఫ్ దేవ్ జీ కూడా పోలీసుల నిర్బంధంలో వున్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు విజయవాడ, ఏలూరు వంటి నగరాల్లో తలదాచుకున్న మావోయిస్టులను తక్షణమే కోర్టుకు అప్పగించాలని డిమాండ్ చేశాయి. ఆపరేషన్ కగార్ పేరిట జరుగుతున్న కాల్పులపై ఉన్నతస్థాయి న్యాయస్థానంతో విచారణ జరపాలని కోరాయి. ఆదివాసీలను నిర్వాసితులను చేస్తున్న విధానాన్ని, ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ ప్రకటనపై సంతకాలు చేసినవారిలో వి. శ్రీనివాసరావు (సీపీఎం), జి. ఈశ్వరయ్య (సీపీఐ), పి. ప్రసాద్ (సీపీఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ), జాస్తి కిషోర్‌బాబు (సీపీఐ-ఎంఎల్), కాటం నాగభూషణం (ఎంసీపీఐ-యు), బి. బంగార్రావు (సీపీఐ-ఎంల్-లిబరేషన్), ఎం.రామకృష్ణ (సీపీఐ-ఎం.ఎల్-న్యూడెమోక్రసీ), బి.ఎస్. అమర్‌నాథ్ (యస్‌యూసీఐ-సి), పి.సుందరరామరాజు (పార్వర్డ్ బ్లాక్), జానకి రాములు (రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ) వున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





