భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీర్పు ఇవ్వాలి

– పన్నెండేళ్లుగా మోదీ ప్ర‌భుత్వం రాష్ట్రానికి చేసిందేంటి?
– రాష్ట్రాలకు పైసలు ఆటో మోడ్‌లో వస్తాయి
– పాలమూరు-రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామన్నా కాలేదు
– మహారాష్ట్ర సీఎం వచ్చి ప్రాణహిత-చేవెళ్లపై మాట్లాడనే లేదు
– హైదరాబాద్ వరద బాధితులకు నెరవేరని బండి సంజయ్ హామీ
– సమస్యలకు ప్రధాన కారణం బీఆర్ఎస్సే
– దోపిడీకి అలవాటు పడ్డ వాళ్లకి ఓటు వేస్తే పరిస్థితేంటి?
– మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: కేంద్రం నుంచి ఏ మంత్రి వచ్చినా లక్షల కోట్లు మంజూరు చేశామని చెబుతున్నారు.. కానీ తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లించిన వాటానే రాష్ట్రానికి ఇస్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.1 ఇస్తే 42 పైసలే తెలంగాణకు ఇస్తున్నారు.. కర్ణాటకకు 16 పైసలు, తమిళనాడుకు 26 పైసలు.. కేరళకు 49 పైసలు మాత్రమే ఇస్తున్నారంటూ దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. రావాల్సిన వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని, లెక్కలే చెబుతున్నాయన్నారు. బీహార్‌కు రూ.6.06లు, మధ్యప్రదేశ్‌కు రూ.2.09లు, యూపీకి రూ.2.90 ఇస్తున్నారన్నారు. ఈ వివక్షపై మోదీని కానీ, కేంద్ర ప్రభుత్వాన్నిగానీ, నీతి అయోగ్‌ను కానీ ఏ రోజైనా మీరు అడిగారా అని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డిని అడుగుతున్నానన్నారు. అది వదిలేసి రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టినట్లుగా మాట్లాడటం మీకు న్యాయమా అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్దంగా ఆటో మోడ్‌లో రాష్ట్రాలకు వచ్చే నిధులు అవే వస్తాయి.. దీనికి వీళ్లు చేసిందేం లేదు.. వీళ్ల రికమెండేషన్లు అవసరం లేదు.. కేంద్ర ప్రభుత్వ విచక్షణ అధికారంతో తెలంగాణకు ఏ ఒక్కటీ ఇవ్వలేదు.. ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా రాలేదు అని చెప్పారు. మూసీకి అదనంగా గ్రాంటు తీసుకురాలేదు.. మెట్రోకు నిధులు తీసుకురాలేదు.. సమ్మక్క-సారక్క జాతరకు ప్రత్యేక నిధులు తేలేదు అని విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన ఐటీఐఆర్‌ను, సెమీ కండక్టర్ పాజెక్టులను రాకుండా చేశారన్నారు. పన్నెండేళ్లల్లో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏదైనా నిధులు తెచ్చారా.. కనీసం మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు నిధులు తెచ్చారా అని సీఎం నిలదీశారు. ఖమ్మం వరదల సమయంలోనూ అదనంగా నిధులు ఇవ్వలేదన్నారు. వరంగల్ ఎయిర్‌పోర్టు భూసేకరణ నిధులు కూడా రాష్ట్రం నుంచే చెల్లించాం.. ఇప్పుడు మోదీని చూసి ఓటు వేయాలని అంటున్నారు.. గల్లీ ఎలక్షన్‌కు మోదీకి ఏం సంబంధం.. మోదీ వచ్చి మోరీ తీయిస్తారా? ఓట్లు వేయించుకోవడం.. సీట్లు తెచ్చుకోవడం తప్ప బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేం లేదని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు 2 లక్షల సాగునీరు, తాగునీరు అందించే ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేసేందుకు సహకరిస్తామని ప్రకటిస్తారని అనుకున్నాం కానీ ఆదిలాబాద్ వచ్చినబీప మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తమను అవమానించి ప్రజలను ఓట్లు వేయాలని కోరారన్నారు. హైదరాబాద్ వరదల సమయంలో ముంపునకు గురైన సందర్భంలో కారుకు కారు, బైకుకు బైకు ఇస్తామని జీహెచఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం చేస్తే కిషన్ రెడ్డి ఆ హామీలకు ఆమోదం చెప్పారు.. ఆ మాట నమ్మి జీహెచఎంసీలో 1/3 ప్రజలు బీజేపీకి ఓటు వేశారు కానీ ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తలేదన్నారు. ప్రజలు హామీల గురించి అడిగితే ఇన్స్యూరెన్స్ ఉంది అని సంజయ్ చెప్పాలా అని రేవంత్ అడిగారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.. ఇది తెలంగాణ ప్రజలను, ఓటర్లను అవమానించడం కాదా అని ప్రశ్నించారు. అసదుద్దీన్ ఒవైసీని భూతంగా చూపి ఎంతకాలం మత రాజకీయాలు చేస్తారు? రాజకీయ మనుగడ కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం వాళ్ల భావదారిద్య్రానికి నిదర్శనంని అన్నారు.

సమస్యలకు ప్రధాన కారణం కేసీఆర్, కేటీఆర్, హరీష్లే

రాష్ట్రంలో గత పదేళ్లు బీఆరఎస్ అధికారంలో ఉంది.. సమస్యల పరిష్కారానికి తమకే ఓటు వేయాలని పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు అడుగుతున్నారు.. సర్పంచ్ నుంచి మున్సిపల్ వరకు పెత్తనం మీరే చలాయించారు.. ఇవాళ సమస్యలకు ప్రధాన కారణం కేసీఆర్, కేటీఆర్, హరీష్ కాదా? ఏ ముఖం పెట్టుకుని ఇపుడు మళ్లీ ఓట్లు అడుగుతున్నారు అని ఆయన నిలదీశారు. అహంకారం, విద్వేష ప్రసంగాలతో గంజాయి, కొకైన్ తీసుకున్న వారిలా మాట్లాడుతున్నారన్నారు. దోపిడీకి అలవాటు పడ్డ ఇలాంటి వాళ్లకి ఓటు వేస్తే పరిస్థితి ఏంటి? ఉన్మాదంతో మానసిక రోగంతో టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా రూ. వందల కోట్లు వసూలు చేశారు.. విచారణకు పిలిస్తే ముసుగు తొడుక్కుని వెళ్లకుండా బరితెగించి ఏదో యుద్ధానికి వెళ్లినట్టు వెళుతున్నారు.. మూడోసారి మళ్లీ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు అని విమర్శించారు. బీజేపీ, బీఆరఎస్‌లది 2023 వరకు విడదీయలేని అనుబంధం.. నోట్ల రద్దు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, త్రిపుల్ తలాక్‌కు మద్దతునిచ్చారు.. మీ ప్రేమ ఉంటే చాలు.. ఇంకేమీ అవసరం లేదని మోదీతో కేసీఆర్ అన్నారు అని సీఎం ఆరోపించారు. ఈ బంధాన్ని తెలంగాణకు నిధులు తేవడానికి మాత్రం ఉపయోగించలేదన్నారు. అందుకే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ అరెస్టు కాకుండా బీజేపీ కాపాడుతోందన్నారు. బీఆరఎస్‌ను యాసిడ్ పోసి కడిగితే తప్ప రాష్ట్రానికి పట్టిన పీడ వదలదని వ్యాఖ్యానించారు. బీఆరఎస్ మొక్కను మళ్లీ మొలవనివ్వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మొదటి తేదీనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు

తాము అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మొదటి తేదీనే వచ్చేలా చేశామన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం.. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం.. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చాం..
రేషన్ కార్డులు అందించి పేదలకు సన్న బియ్యం అందిస్తున్నాం.. రైతు రుణ మాఫీ చేసి, 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా చెల్లించాం.. సŸన్నాలకు రూ.500 బోనస్ అందించి పండించిన ప్రతీ గింజ కొంటున్నాం.. పేదలకు నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం.. ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు అందిస్తున్నాం అని వివరించారు. మేం అధికారంలోకి వచ్చాక 70 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం.. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం.. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నాం.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం.. వందేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా బీసీ కులగణన చేసి చూపించాం.. నలభై ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం.. పన్నెండేళ్ళ మోడీ పాలన, పదేళ్ల బీఆరఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకుని ఓటు వేయండి అని ప్రజలకు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. సమాజానికి ఏది మేలు చేస్తుందో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండన్నారు. ఈ ప్రభుత్వం మీది.. మీ కోసం పనిచేస్తుంది.. రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీని కలిసి అడుగుతాం.. అవసరమైతే కేంద్రంతో కొట్లాడుతాం.. మరో ఎనిమిదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది.. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా తనది అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *