– ఎన్నికల షెడ్యూల్ విడుదల : సీఈవో సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికను నవంబర్ 11 నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయడానికి ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నికను స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఉప ఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఈనెల 13వ తేదీన వెలువడుతుంది. నామినేషన్ల దాఖలురు చివరి తేదీ 21, పరిశీలన 22, ఉపసంహరణకె గడువు అక్టోబర్ 24గా నిర్ణయించారు. పోలింగ్ నవంబర్ 11న, లెక్కింపు 14న జరుగుతుందని సుదర్శన్‌రెడ్డి తెలిపారు.. మొత్తం ఎన్నిర ప్రక్రియ నవంబర్ 16, 2025 నాటికి పూర్తవుతుందన్నారు. ఉప ఎన్నికలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్లు (ఈవోఎం), వీవీ ప్యాట్ యంత్రాలను వినియోగించనున్నారు. అవసరమైన యంత్రాలను ఇప్పటికే పరీక్షించి సిద్ధం చేశామని, పోలింగ్ సాఫీగా జరగేందుకు అన్ని సాంకేతిక, భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు. వోటర్లు తమ వోటరు గుర్తింపు కార్డు కానీ, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్ కార్డు, పెన్షన్ పత్రం వంటి గుర్తింపు పత్రాలతో ఓటు వేయవచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తక్షణమే అమల్లోకి వచ్చిందన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తమకు ఉన్న క్రిమినల్ నేపథ్య వివరాలను పత్రికలు, టీవీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా ప్రకటించడం తప్పనిసరి అని కమిషన్ స్పష్టం చేసింది. వోటర్లు తమ పేర్లు వోటరు జాబితాలో ధ్రువీకరించుకుని పోలింగ్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





