– నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
– అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధిపై ప్రణాళిక
– మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ.5.15 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ నియోజకవర్గంలో ఈరోజు రూ.5 కోట్లకుపైగా నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతామని తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అన్ని సమస్యలు తొలగిస్తున్నామన్నారు. గత పదేళ్లుగా హైదరాబాద్ నగరంలో బస్తీలు, కాలనీల అభివృద్ధి జరగలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించిన వారిలో తమకు సన్నిహితంగా ఉన్నవారి నియోజకవర్గాలు మాత్రమే అభివృద్ధి జరిగాయని, వివక్షపూరితంగా వ్యవహరించారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు లేకుండా పరిష్కరిస్తున్నామని, నగరంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి ప్రత్యేక ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. నగర ప్రజలు సమస్యలు ఉంటే స్థానిక అధికారి, ప్రజాప్రతినిధుల దృష్టికి లేదంటే మంత్రుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాతోపాటు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందిస్తున్నామని, తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అండగా ఉండాలని మంత్రి ప్రభాకర్ కోరారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావులు మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలు నాలాలు, సీసీ రోడ్లు, తాగునీటి సమస్యలను తీర్చమని కోరుతున్నారని, ప్రజా సమస్యలన్నింటినీ తీరుస్తామని చెప్పారు. షేక్‌పేట్ వార్డులో రూ.315.90 లక్షలతో చేపట్టనున్న ఫ్లైఓవర్ కింద స్పోర్ట్స్ పార్క్‌కు, కమ్యూనిటీ డెవలప్మెంట్, ఫుట్‌పాత్‌తోపాటు హరిజన బస్తీవద్ద సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఇక వెంగళ్రావు నగర్ వార్డులో గురుద్వార్ా కమాన్ వద్ద రూ.100.5 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణాలకు, యూసుఫ్‌గూడ వార్డులో రూ.95.75 లక్షలతో కమలాపురి అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ పక్కన చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ దాసరి హరిచందన, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.





