– ఎంపిక చేసిన అధినేత కేసీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్‌ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైంది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీహిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యతనిస్తూ ఆమెను అభ్యర్ధిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డిలతో పార్టీ అధినేత చర్చించారు.
సీనియర్ నేతలతో తాజా పరిస్థితులపై కేసీఆర్ సమీక్ష
గజ్వెల్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశాలున్నాయని, ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకొని విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని మాజీ సీఎం, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సూచించారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్‌లతోపాటు పలువురు నాయకులతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. ఉప ఎన్నికకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్‌లో ప్రతి అంశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు అన్ని నివేదికలు చెబుతున్నాయని అన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను అప్రమత్తం చేసి తద్వారా వోటర్లలో అవగాహన కల్పించాలని సూచించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పేందుకు జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్ని అప్రమత్తం చేయాలని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





