వోటేయకపోతే పథకాలు ఆపేస్తార‌ట‌

– ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూలగొట్టడమేనా?
– అవినీతి సొమ్ముతో అడ్డదారులు తొక్కుతున్నారు
– మోదీ కనుసన్నల్లో రేవంత్‌ పనిచేస్తున్నారు
– కాంగ్రెస్‌కు వోటుతో బుద్ధి చెప్పాల
– జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ సమావేశంలో బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: తమకు వోటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను బెదిరిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ఆరోపించారు. హైడ్రా పేరుతో బిల్డర్ల దగ్గర దోచుకున్న అవినీతి సొమ్మును ఉప ఎన్నికలో పంచి గెలవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయని ఆయన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో బుధవారం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం రహ్మత్‌ నగర్‌ డివిజన్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. హామీలు అమలు చేయకుండా తమ అసమర్థతను అప్పులపై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్‌ను ప్రజలు తీవ్రంగా ద్వేషిస్తున్నారన్నారు. ఇటీవల గణేష్‌ నిమజ్జనానికి వెళ్లిన సీఎం రేవంత్‌ను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదన్న కేటీఆర్‌.. ప్రభుత్వంతో ప్రజలు డిస్‌కనెక్ట్‌ అయ్యారనడానికి అదే నిదర్శనమన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో చేరలేదన్న అక్కసుతో బీఆర్‌ఎస్‌ కార్యకర్త సర్దార్‌ ఇంటిని కూల్చివేస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు వోటేస్తే తమ ఇండ్లను కూలగొట్టేందుకు ప్రభుత్వానికి లైసెన్స్‌ ఇచ్చినట్టేనని హెచ్చరించారు. దుర్గం చెరువులో అక్రమంగా ఇల్లు కట్టుకున్న రేవంత్‌ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చే దమ్ముందా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ మార్గదర్శనంలో నడుస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్న సత్యాన్ని మైనారిటీలు గుర్తించాలన్నారు. రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌కు వోటేస్తే నరేంద్ర మోదీకి, బీజేపీకి వేసినట్టేనన్నారు. మైనారిటీలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. చరిత్రలో తొలిసారి మైనారిటీ మంత్రి లేకుండా ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఇస్తామని మోసం చేయడంతోపాటు షాదీ ముబారక్‌, మైనారిటీ గురుకుల పాఠశాలలు వంటి సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసిందన్నారు. రూ.4000 కోట్ల మైనారిటీ బడ్జెట్‌ ఇస్తామని ఇవ్వలేదని విమర్శించారు. పదేళ్లలో మైనారిటీల కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.12,000 కోట్లు ఖర్చుపెట్టిందన్నారు. 60 ఏళ్లుగా ముస్లింలను వోటు బ్యాంకుగానే కాంగ్రెస్‌ వాడుకుందని మండిపడ్డారు. దివంగత నేత మాగంటి గోపీనాథ్‌ను స్మరించుకున్న కేటీఆర్‌.. ఎవరూ కోరుకోని ఉప ఎన్నిక ఇదన్నారు. జూబ్లీహిల్స్‌లో ఏ ఒక్కరికి కష్టమొచ్చినా ఆదుకుని, ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసిన గోపీనాథ్‌ కుటుంబానికి జూబ్లీహిల్స్‌ ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌కు వోటుతో బుద్ధి చెప్పాలని నియోజకవర్గ వోటర్లకు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

బిఆర్ ఎస్ ప‌రిస్థితి మెరుగ్గా ఉంది

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ సత్తా చూపిస్తామని పీజేఆర్‌ కొడుకు విష్ణువర్ధన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారని, అన్ని డివిజన్లలో కాంగ్రెస్‌ కంటే బీఆర్‌ఎస్‌ పరిస్థితి మెరుగ్గా ఉందని పలు సర్వేలు చెబుతున్నాయని అన్నారు. కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేసి బంపర్‌ మెజారిటీ కోసం కృషి చేయాలన్నారు. గత ఎన్నికల్లో హైదరాబాద్‌ నగరంలోని అన్ని సీట్లను గెలిపించి ప్రజలు బీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారన్న కేటీఆర్‌.. అదే స్ఫూర్తితో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ ను గెలిపించుకుని హైదరాబాద్‌ గులాబీ అడ్డా అన్న సందేశాన్ని దేశానికి ఇవ్వాలని కార్యకర్తలకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 14లోపు ప్రతి ఇంటికి వెళ్లి గోపీనాథ్‌ చేసిన పనులు, సేవలను వోటర్లకు గుర్తుచేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ అభిమానులు, సానుభూతిపరుల వోట్లు గల్లంతైతే వెంటనే నమోదు చేయించాలని సూచించారు. యుద్ధంలా పోరాడితేనే విజయం సాధ్యమవుతుందని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, రహ్మత్‌ నగర్‌ ఇంచార్జీ తక్కళ్లపల్లి రవీందర్‌ రావు, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌ భాస్కర్‌, పి.విష్ణువర్ధన్‌ రెడ్డి, కోరుకంటి చందర్‌, దివంగత మాగంటి గోపినాథ్‌ సతీమణి మాగంటి సునీత, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *