‘‌జూబ్ల్సీ హిల్స్’ ‌పోరుకు సిద్దమవుతున్న పార్టీలు

  ( మండువ రవీందర్‌రావు )
జూబ్లీహిల్స్‌లో రాజకీయ వేడి రాచుకుంటున్నది. ఇక్కడ ఉప ఎన్నికలకు ఇంకా షెడ్యూల్‌ ‌విడుదలకాకముందే ప్రధాన రాజకీయ పార్టీలు ఈ నియోజకవర్గంపై దృష్టి సారించాయి. బరిలో నిలిచేది ఎవరన్న విషయాన్ని ఆయా పార్టీలనుండి ప్రకటించకపోయినా ఎవరికివారు గెలుపుపైన అప్పుడే ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఆయాపార్టీల ముఖ్యనాయకులు ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తుండడంతో రాజకీయవేడందుకుంటున్నది.
జూబ్లీహిల్స్ ‌సిట్టింగ్‌ ‌బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌మాగంటి గోపీనాథ్‌ ‌జూన్‌ ఎనిమిదన ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇక్కడ జరుగనున్న ఉపఎన్నికలో ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు రాష్ట్రంలోని ప్రధానపార్టీలు పోటీపడుతున్నాయి. తమ సిట్టింగ్‌ ‌స్థానాన్ని తిరిగి దక్కించుకుంటామని బిఆర్‌ఎస్‌ ‌చెబుతుండగా, ఈ స్థానంలో తమ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని అధికార కాంగ్రెస్‌, ‌బిజెపిలు ప్రకటిస్తున్నాయి. కాగా అభ్యర్థి ఎంపిక విషయంలో బిఆర్‌ఎస్‌ ఒక అడుగు ముందే ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ఇటీవల ఈ నియోజకవర్గ పార్టీ సమావేశంలో దివంగత గోపీనాథ్‌ ‌భార్య మాగంటి సుజాతను బరిలోకి దింపేందుకు బిఆర్‌ఎస్‌ ‌సిద్దమైనట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇదే సెంటిమెంట్‌తో గతంలో కంటోన్మెంట్‌ ‌బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌సాయన్న ఆకస్మిక మరణంతో ఆయన కుమార్తె లాస్య నందితకు పట్టంకట్టినప్పటికీ, ఆమె ప్రమాదంలో మరణించడంతో ఏర్పడిన మరో ఉప ఎన్నికలో సాయన్న రెండవకూతురు పోటీచేసినా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో గ్రేటర్‌లో కాంగ్రెస్‌కు మొదటిసారిగా చంపుడుపందెం లభించినట్లైంది. అలాగే ఇప్పుడు జూబ్లీహిల్స్ ‌విషయంలో దివంగత గోపీనాథ్‌ ‌భార్య సుజాతను నిలబెట్టాలని బిఆర్‌ఎస్‌ ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతున్నది. కంటోన్మెంట్‌ ‌మాదిరిగానే, జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గ ప్రజలు ఆ కుటుంబాన్ని ప్రగాఢంగా అభిమానిస్తున్నారు. అయినప్పటికీ గోపీనాథ్‌పై వారికున్న అభిమానం ఎలాంటి తీర్పునివ్వనున్నారన్నది భవిషత్‌లోనే తేలనుంది. ఇప్పటికే బిఆర్‌ఎస్‌ ఆ ‌నియోజకవర్గంలోని తమ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నది. డివిజన్ల వారీగా, ఎంఎల్‌ఏలకు, ఎంఎల్‌సీలకు బాధ్యతలను అప్పగిస్తున్నది. బూత్‌ల వారీగా సీనియర్‌ ‌నాయకులకు, స్థానిక కార్పోరేటర్లకు బాధ్యతను అప్పగిస్తున్నది. అభ్యర్థిగా సుజాతను అధికారికంగా ప్రకటించకపోయినా ఆమె వివిధ కాలనీల్లో పర్యటిస్తూ గోపీనాథ్‌ ‌సంతాప సభలను నిర్వహిస్తున్నారు. ఆమె ఇద్దరు కుమారులు ఆమెకు తోడుగా ఉంటున్నారు.
ఇక్కడినుండి పోటీచేసేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీలో ఆశావహులు చాలామందే ఉన్నట్లు తెలుస్తున్నది. గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఆభ్యర్థి చేతిలో ఓటమి చవిచూసిన నవీన్‌ ‌యాదవ్‌ ‌మారోసారి పోటీ చేసేందుకు అదిష్టానాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా మాజీ ఎంపీ మహ్మద్‌ ఆజారుద్దీన్‌,  ‌ఖైరతాబాద్‌ ఎంఎల్‌ఏ ‌దానం నాగేందర్‌లుకూడా ఆసక్తి కనబర్చిన వారిలో ఉన్నారు. అయితే ఖైరతాబాద్‌ ఎంఎల్‌ఏగా దానం నాగేందర్‌ ‌రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆలా అయితే మరో ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. దానికి కాంగ్రెస్‌ అధిష్టానం అంగీకరించకపోవచ్చనుకుంటున్నారు. కాగా తాను జూబ్లీహిల్స్ ‌నియోజవర్గంలో పోటీ చేస్తానంటూ వస్తున్న వదంతుల్లో వాస్తవంలేదని తాజాగా దానం నాగేందర్‌ ‌చెప్పడం ఒకటికాగా, పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఏల కేసు ఉండడంతో ఆయన పొటీపడే అవకాశం లేకపోవచ్చనుకుంటున్నారు. ఇకపోతే ఆజారుద్దీన్‌ ‌విషయంలో ఆయన్ను గవర్నర్‌ ‌కోటాలో ఎంఎల్సీగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నామినేట్‌ ‌చేసిన విషయం తెలిసిందే. దీంతో నవీన్‌ ‌యాదవ్‌కు ఒక విధంగా లైన్‌ ‌క్లియర్‌ అయినట్లే అనుకుంటున్నారు. అయితే మాజీ మేయర్‌ ‌బొంతు రామ్మోహన్‌, ‌రహమత్‌ ‌నగర్‌ ‌కార్పోరేటర్‌ ‌సిఎన్‌ ‌రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్లు కూడా వినవస్తున్నాయి. అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలకపోయినా కాంగ్రెస్‌ ఆ ‌నియోజకవర్గంలో సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి నియోజకవర్గంలోని పలు కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిని పెట్టారు.
బిజెపి కూడా జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గాన్ని ఎలాగైనా గెలుచుకోవాలన్న పట్టుదలతోఉంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఈ నియోజకవర్గం ఉండడంతో ఆయన ఇక్కడ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. ఆ పార్టీకూడా ఈసారి గెలుచే అభ్యర్థిని ఎంపిక చేయాలన్న ఆలోచనతో జల్లెడ పడుతున్నట్లు తెలుస్తున్నది. అయితే ఇప్పటి వరకు వినవస్తున్న పేర్లలో మాధవీలత పేరు ప్రధానం కాగా, చింతల రామచంద్రారెడ్డి, లంకల దీపక్‌రెడ్డితోపాటు మరికొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బీహార్‌ ఎన్నికలతోపాటు ఈ నియోజకవర్గ ఎన్నిక జరుగవచ్చనుకుంటున్న క్రమంలో అక్టోబర్‌ ‌మొదటివారంలో ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్‌ ‌విడుదల కావచ్చనుకుంటున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *