– అక్రిడిటేషన్ పాలసీపై యాక్షన్ ప్లాన్
– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. సచివాలయంలో హోమ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రవి గుప్తా, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, ఐ అండ్ పిఆర్ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక, సీపీఆర్‌వో జి. మల్సూర్ తో కలిసి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్ కార్డ్ లు అందేలా విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇందుకోసం హై పవర్ కమిటీని కూడా పునరుద్దరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జి.ఓ. జారీ చేసిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ ఊసే ఎత్తలేదని విమర్శించారు. అలాగే, జర్నలిస్టుల జీతభత్యాలకు సంబంధించి త్రైపాక్షిక కమిటీని కూడా పునరుద్దరిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల హెల్త్ పాలసీపై సమగ్రంగా చర్చించామని, ఇన్సూరెన్స్ పాలసీలో ఏది జర్నలిస్టులకు ప్రయోజనకరంగా ఉంటుందో అనే అంశంపై ఆరోగ్యశ్రీ విభాగంతో కలిసి లోతైన అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అక్రిడిటేషన్ పాలసీపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రత్యేక వెబ్ సైట్ ను తక్షణమే రూపొందించాలని అధికారులకు సూచించారు. జర్నలిస్టులకు అవార్డులను పునరుద్దరించాలని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ఆరోగ్యశ్రీ సి.ఇ.ఓ. ఉదయ్ కుమార్, కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




